విమర్శిస్తూనే పథకాల రేస్ లోకి దూకిన బాబు

Update: 2023-05-29 05:06 GMT

రాష్ట్రమా...రాజకీయమా?. తెలుగు దేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజకీయం వైపు మొగ్గుచూపారు. తనతో పాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే తాను కూడా బటన్ నొక్కుడు స్కీముల వైపు మొగ్గుచూపక తప్పదని నిర్ణయించుకున్నట్లు మహానాడు లో అయన ప్రకటించిన స్కీములు చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. ఇప్పటికే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న బటన్ స్కీములతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని...అభివృద్ధి ఆగిపోయింది అని తెలుగుదేశం నాయకులు గత కొంత కాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో చాలా వరకు వాస్తవాలే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి ఉంది. కీలక ప్రాజెక్ట్ లు కూడా అడుగు ముందుకు పడటం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీల హామీలు ప్రజల అవసరాల ప్రకారం కాకుండా ఏవి అయితే తమ గెలుపును సులభం చేస్తాయో ..ఎక్కువ మంది ఓటర్లు ఉన్న వర్గాలను ఆకట్టుకోవచ్చో చూసుకుని మరి స్కీములు డిజైన్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది జగన్ అయినా...చంద్రబాబు అయినా ప్రజలు పన్నులు కట్టిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేస్తూ తాము ఏదో ప్రజలకు మేలు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పన్నులు కట్టే వారి అవసరాలు పక్కన పెట్టి ఓట్లు కొనుగోలు మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఆదివారం నాడు మహానాడు వేదికగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలిదశ మేనిఫెస్టో చూస్తే ఒకవేళ తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన ఈ స్కీములు అన్ని అమలు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడు కూడా ఉంటాయి. అభివృద్ధి అనే ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.

ఎన్నికల నాటికీ ఇంకా కొన్ని స్కీములు ప్రకటించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.. మరి తెలుగు దేశం పార్టీ కలల రాజధాని అమరావతి తో పాటు ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు ఎలా వస్తాయనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు . చంద్రబాబు సంపద పెంచి వీటిని పంపిణి చేస్తారు అని చెపుతున్నా ఇది అంత ఈజీ గా జరిగే వ్యవహారం కాదు అని అందరికి తెలిసిందే.ఒకటి మాత్రం నిజం...గత ఎన్నికల్లో వై ఎస్ జగన్ తాను గెలిచేందుకు భారీ హామీలు గుప్పించి..ఇప్పుడు ఎవరైనా సరే అంతకు మించి ఇస్తే తప్ప గెలవలేని పరిస్థితి కల్పించారు. ఇప్పుడు ఆ రేస్ లోనే చంద్రబాబు జగన్ కు మించి హామీలు ప్రకటించే పనిలో ఉన్నారు అని చెప్పొచ్చు. జిల్లాల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కర్ణాటక నుంచి , ఏడాదికి మూడు సిలిండర్లు తెలంగాణ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టారు అనే విమర్శలు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా దగ్గర దగ్గర ఏడాది కాలం ఉన్న సమయంలో చంద్రబాబు అప్పుడే ఎన్నికల శంఖారావం పూరించటం విశేషంగానే చెప్పాలి. అయితే వీటిని టీడీపీ ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళుతుంది..వీటిని ఎలా అమలు చేస్తారు అనే విషయంలో వాళ్ళను ఎలా నమ్మిస్తారు అన్నదే టీడీపీ ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అని ఆ పార్టీ నాయకులు కూడా చెపుతున్నారు.

Tags:    

Similar News