తెలంగాణ‌లో 'ఏడు ముక్క‌లాట‌!'

Update: 2021-08-06 05:42 GMT

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ళ‌కుపైనే స‌మ‌యం ఉంది. కానీ తెలంగాణ‌లో రాజ‌కీయం క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతోంది. రాజ‌కీయాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ప‌రిణామాలు వ‌స్తూనే ఉంటాయి. కాక‌పోతే ఈ సారి మాత్రం అవి కాస్త ఎక్కువ వ‌స్తున్న‌ట్లు క‌న్పిస్తున్నాయి. తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ సారి 'ఏడు ముక్క‌లాట‌!' త‌ప్పేలా లేదు. ఎన్నిక‌ల నాటికి మ‌రిన్ని పార్టీలు తెర‌పైకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బిజెపి, టీడీపీ, వైఎస్ఆర్ టీపీ, ప్ర‌వీణ్ కుమార్, తీన్మార్ మ‌ల్ల‌న్న ఇలా కొత్త రాజ‌కీయ శ‌క్తులు తెర‌పైకి వ‌స్తున్నాయి. పేరుకు పార్టీలే అయినా ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీతోపాటు టీడీపీల ప్ర‌భావం తెలంగాణ‌లో అడుగంటిపోయింద‌నే చెప్పాలి. అయితే ఇప్పుడు కొత్త‌గా వై ఎస్ ష‌ర్మిల పార్టీ, బిఎస్పీ ద్వారా బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌వీణ్‌కుమార్, తీన్మార్ మ‌ల్ల‌న్న‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ మేర‌కు ప్ర‌భావం చూపిస్తార‌న్న‌దే తేలాల్సి ఉంది. కొద్ది కాలం క్రితం వ‌ర‌కూ తెలంగాణ‌లో బిజెపి దూకుడు చూపించినా అది కాస్తా ఈ మ‌ధ్య త‌గ్గిన‌ట్లు క‌న్పిస్తోంది. అంతే కాదు ఆ పార్టీ నుంచి వ‌ల‌స‌లు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతానికి కొత్త జోష్ వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి వ‌చ్చిన త‌ర్వాత ఆ పార్టీలో ఆశ‌లు అయితే చిగురించాయి. క్యాడ‌ర్ లో ఒకింత ఊపు వ‌చ్చింది. వైఎస్ ష‌ర్మిల పూర్తిగా దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇమేజ్ ను మాత్ర‌మే న‌మ్ముకుని రాజ‌కీయ పార్టీ ప్రారంభించారు. మ‌రి ఇప్పుడు అది తెలంగాణ‌లో ఏ మేర‌కు ఫ‌లిస్తుంది. ఎన్ని జిల్లాల్లో ప్ర‌భావం చూపిస్తుంది అనే అంశంపై ఎవ‌రి అంచ‌నాలు వారివి. ష‌ర్మిల పార్టీ కాస్తో కూస్తో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాతోపాటు న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్, రంగారెడ్డి ల్లో కొంత ప్ర‌భావం చూపించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

అయితే అది ష‌ర్మిల పార్టీ అయినా...ప్ర‌వీణ్ కుమార్ పార్టీ అయినా గండికొ్ట్టేది సంప్ర‌దాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే అనే అంచ‌నాలు ఉన్నాయి. తీన్మార్ మ‌ల్ల‌న్న మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటారు. మ‌ల్ల‌న్నకూడా ఇప్ప‌టికే అన్ని జిల్లాల్లో టీమ్ లు పెట్టుకుని పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ప్ర‌వీణ్ కుమార్ రాజ‌కీయంగా ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తారు అనేది ఇప్ప‌డికిప్పుడు చెప్ప‌టం క‌ష్ట‌మే అయినా..గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అంటే ప్ర‌భుత్వ ఉద్యోగంలో ఉండ‌గానే అన్ని జిల్లాల్లో ఆయ‌న నెట్ వ‌ర్క్ అయితే బ‌లంగా ఏర్పాటు చేసుకున్నార‌ని అంటున్నారు. అయితే కొత్త పార్టీలు పెట్టిన వారు..పెట్ట‌బోయే సొంతంగా ఎన్ని సీట్లు సాధిస్తారు అన్న‌ది ఇప్పటికిప్పుడు లెక్క‌లు తేల‌టం క‌ష్ట‌మే కానీ...ఖ‌చ్చితంగా ఎవ‌రో ఒకరి గెలుపు అవ‌కాశాలను మాత్రం దారుణంగా దెబ్బ‌తీస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రిగితే తొమ్మిదిన్న‌రేళ్ళ‌ పాల‌న త‌ర్వాత అధికార టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావటం అంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం ఏమీ కాదు. ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసినా టీఆర్ఎస్ కు ప్ర‌తికూల అంశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మ‌రి ఈ సారి 'ఏడు ముక్క‌లాట‌!' లో అంతిమ విజేత‌గా ఎవ‌రు నిలుస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News