కేంద్రం పద్మ అవార్డులకు సంబంధించి ప్రకటన చేసే ముందు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు తీసుకుంటుంది. అయితే ఆ పేర్లను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు అని చెప్పలేం. కొన్నిసార్లు కొంతమందికి వస్తాయి..కొన్నిసారు పూర్తిగా సొంతంగా కేంద్రమే ప్రకటిస్తుంది. ఇందులోకి కూడా ఎప్పటినుంచో రాజకీయ కోణాలు జొరబడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 15 న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు మొత్తం 31 పేర్లు సిఫారసు చేసింది. అందులో పద్మ విభూషణ్ మూడు ఉంటే, పద్మ భూషణ్ మూడు, పద్మ శ్రీ సిఫారసులు 25 ఉన్నాయి. ఈ సిఫారసుల్లో ఎక్కువ భాగం సినిమా రంగానికి చెందినవి ఉండటం విశేషం. గత కొంత కాలంగా టాలీవుడ్ లో పలు వివాదాలకు కారణం అవుతున్న నిర్మాత వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) పేరు పద్మ శ్రీ సిఫారసుల జాబితాలో ఉండటం మరో విశేషం.
ఆయనతో పాటు బి. నర్సింగ్ రావు (ఆర్ట్, ఫిలిం డైరెక్టర్, ప్రొడ్యూసర్ ),బి. ఆనంద సాయి (ఆర్ట్, టెంపుల్ డైరెక్టర్ ) దివంగత దొరస్వామి రాజు (ఆర్ట్, ఫిలిం ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్), కే రాఘవేందర్ రావు, (ఫిలిం డైరెక్టర్ ), జె జమున ( ఫిలిం యాక్టర్ ) దివంగత కైకాల సత్యనారాయణ (ఆర్ట్, ఫిలిం ప్రొడ్యూసర్ ), బసిరెడ్డి కొత్త (ఆర్ట్ ప్రొడ్యూసర్ ), నారాయణదాసు కృష్ణదాస్ నారంగ్ (ఫిలిం ప్రొడ్యూసర్ ) విభాగాలనుంచి పంపారు. వీళ్ళతో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య , టిఎస్ జెన్ కో , ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు పేరును కూడా పద్మ శ్రీ కి సిఫారసు చేశారు. ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కి పద్మ విభూషణ్, నారాయణ్ సింగ్ భాటి కి సివిల్ సర్వీస్ స్పెషల్ ట్రయినింగ్ విభాగం లో పద్మ భూషణ్, కాలాల లక్ష్మా గౌడ్ కు ఆర్ట్, పెయింటర్ విభాగంలో పద్మ భూషణ్ కు సిఫారసు చేశారు. డాక్టర్ ఎన్ గోపి, సింగీతం శ్రీనివాసరావు పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. అయితే తెలంగాణ సర్కారు పంపిన జాబితా నుంచి కాకుండా కేంద్రమే పూర్తి సొంతంగా అవార్డులు ప్రకటించింది. కూచిపూడి డాన్స్ కు సంబంధించి రాజా రెడ్డి, రాధా రెడ్డి పేర్లను పద్మ విభూషణ్ కు సిఫారసు చేశారు.