అన్ని నియోజకవర్గాలను గజ్వేల్, సిరిసిల్ల.. సిద్ధిపేటలా చూస్తున్నారా?

Update: 2021-04-22 07:12 GMT

ఒకటే రాష్ట్రం. కానీ నియోజకవర్గానికో లెక్క. మళ్లీ అది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిది అయితే మరీ దారుణం. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ విధానం ఖచ్చితంగా అభ్యంతరకరమే?. వ్యాక్సినేషన్ భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టి..కేంద్రంలోని మోడీ సర్కారు చోద్యం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేట్ వ్యాక్సిన్ కంపెనీలకు మేలు చేసేలా వ్యవహరిస్తోందనే చెప్పాలి. కేంద్రానికి సరఫరా చేసే వ్యాక్సిన్ ధర 150 రూపాయలకు వచ్చినప్పుడు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి 400 రూపాయలు ఎలా అవుతుంది. పైగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్రమే అటు సీరమ్, ఇటు భారత్ బయోటెక్ లకు వరసగా 3000 కోట్లు, 1500 కోట్ల రూపాయల లెక్కన రుణం కూడా మంజూరు చేస్తోంది. మరి ఈ మేరకు కంపెనీలు దేశ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలి కదా?. చేసేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే కదా?. కానీ అదెక్కడా కన్పించటం లేదు. ఒకే దేశం..రెండు వ్యాక్సిన్ ధరలా అని కేంద్రాన్ని మంత్రి కెటీఆర్ బాగానే ప్రశ్నించారు. ఇందులో ఆక్షేపించాల్సింది ఏమీలేదు.

కానీ ఇదే సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ లు తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకే రకంగా చూస్తున్నారా?. ముఖ్యమంత్రి కెసీఆర్ కు చెందిన గజ్వేల్ నియోజవకర్గం, కెటీఆర్ కు చెందిన సిరిసిల్ల నియోజకవర్గం, మంత్రి హరీష్ రావు నియోజకవర్గాలకు కేటాయించే నిధులు ఎన్ని?. రాష్ట్రంలోని మిగిలిన నియోజవకర్గాలకు కేటాయించే నిధులు ఎన్ని?. ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న మౌలికసదుపాయాలు ఏమిటి?. ఇతర వసతులు ఏమిటి?. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి?. అంటే ఖచ్చితంగా నక్కకు..నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. పక్కనోళ్లను ప్రశ్నించటానికి వచ్చేసరికి అందరికీ లెక్కలు..హేతుబద్దతలు గుర్తొస్తాయి. కానీ తమ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అవేమీ పనిచేయవు. ఈ పోలిక తెచ్చింది కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించటానికి కాదు?.అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు చెప్పటానికే. దేశమంతటికీ ఒకేలా చూడాల్సిన ప్రదాని మోడీ అలా ఏ మాత్రం చూడటం లేదు. రాష్ట్రమంతటినీ ఒకేలా చూడాల్సిన సీఎం కెసీఆర్ కూడా ఇక్కడ అలాగే చూస్తున్నారు.

Tags:    

Similar News