చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల విస్మయం
రాష్ట్ర విభజన అనంరతం ఏర్పాటైన తొలి ఏపీ సర్కారులో చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరించింది నారాయణే అన్న సంగతి టీడీపీ నేతలు అందరికీ తెలుసు. రాజధాని అమరావతితోపాటు సీఆర్ డీఏ కాంట్రాక్టులు అన్నీ ఆయన చేతుల మీదుగానే సాగేవి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన అనంతరం ఆయన పత్తా లేకుండా పోయారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా..పార్టీ నేతలపై ఎన్ని కేసులు నమోదు అయినా ఆయన పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది ఏమీలేదు. మాజీ మంత్రి నారాయణ అమరావతిలో బినామీ పేర్లతో వేల ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపణలు చేసింది. అంతే కాదు..ఆ పార్టీ వేసిన పుస్తకంలో కూడా నారాయణ బినామీలతో3129 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించింది. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన అంశంపై మంగళవారం నాడు చిత్తూరు జిల్లాకు చెందిన పోలీసులు నారాయణ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
నారాయణ అరెస్ట్ తర్వాత టీడీపీ స్పందించిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించకమానదు. చంద్రబాబునాయుడి దగ్గర నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు..నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు అందరూ అరెస్ట్ పై మూకుమ్మడి ఖండనలు ఇచ్చారు. సరే అసలు ఈ మూడేళ్ల కాలంలో టీడీపీ నేతల అరెస్ట్ లు చాలా జరిగాయి..కానీ నారాయణ ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడారా?. పోనీ జగన్ ప్రభుత్వ విధానాలపై ఆయన ఒక్కటంటే ఒక్క మాట్లాడారా? అంటే అసలు ఛాన్సే లేదు. అంటే అధికారంలో ఉంటే అకస్మాత్తుగా తెరపైకి వచ్చి ఎమ్మెల్సీ అయి మంత్రి అయిపోతారు. ఓడిపోతే పక్కకు పోయి పూర్తిగా వ్యాపారం చేసుకుంటారు. అయినా సరే చంద్రబాబునాయుడికి నారాయణ అంటే ఎక్కడలేని ప్రేమ. నిన్న ఆయన అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. దీనికి కారణం పార్టీ కంటే..ఆర్ధిక బంధాలే బలమైనవి అని మరోసారి చంద్రబాబు నిరూపించారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
మరో విశేషం ఏమిటంటే పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసులో నారాయణ అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాత సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు విద్యావంతుల్లో కూడా ఆయనపై ఏ మాత్రం సానుభూతి రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం నుంచే పెద్దగా సానుభూతి లేదు . ఈఎస్ ఐ కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు కేసులోని నిజానిజాలు కాసేపు పక్కన పెడితే జగన్ పై గట్టిగా విమర్శలు చేస్తున్నందుకే ఆరెస్ట్ చేశారని..మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినప్పుడు కావాలని అరెస్ట్ చేశారని టీడీపీ అన్నప్పుడు నమ్మిన వాళ్లు కొంత మంది నమ్మారు. కానీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ విషయంలో మాత్రం ఆ తరహా సానుభూతి ఎక్కడా కన్పించలేదని..ఇలాంటి కేసులో చంద్రబాబు తాను స్పందించటమే కాకుండా..పార్టీ మొత్తాన్ని మూడేళ్ళుగా ఎక్కడా నోరెత్తని నారాయణ కోసం రంగంలోకి దింపటం విస్మయం కలిగిస్తోందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నారాయణ కాలేజీలు..స్కూళ్ళు..అవి చేసే దోపిడీలపై దశాబ్దాల కాలంగా ప్రజల్లో కోపం...కసి ఉన్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నారాయణ అరెస్ట్ సమయంలో జగన్ సర్కారుపై విమర్శలు చేసింది ఒక్క టీడీపీ వాళ్లు తప్ప ప్రజలెవరూ లేరనే చెప్పొచ్చనే అబిప్రాయం వ్యక్తం అవుతోంది.
క్ష