దేశవ్యాప్తంగా నీరసపడిన కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు మేలు చేస్తారో తెలియదు కానీ..తెలంగాణ కాంగ్రెస్ కు మాత్రం ఆయన షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ పునర్ వైభవానికీ పీకె ప్లాన్స్ ఇచ్చారని..అయితే ఇందుకు కాంగ్రెస్ పలు షరతులు విధించిందని వార్తలు వచ్చాయి. షరతుల్లో ముఖ్యమైనది టీఆర్ఎస్, వైసీపీ, టీఎంసీతో రాజకీయ సంబంధాలు తెంచుకోవాలన్నది ఒకటిగా చెబుతున్నారు. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ తో ప్రగతి భవన్ లో చర్చలు జరిపారు. అంతే కాదు..రాత్రి కూడా అక్కడే బస చేశారని మీడియా కథనాలు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులను షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. అలాగని ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయటానికీ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ఇంకా అధికారికంగా కాంగ్రెస్ లో చేరలేదు. ఒక వేళ చేసినా కూడా కాంగ్రెస్ అధిష్టానం తమ జాతీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తుంది కానీ..ఒక్క రాష్ట్రం విషయం ఆలోచించదు అనే విషయం తెలిసిందే. అయితే పోరాడితే గెలుస్తామనే ఆశలు ఉన్న తెలంగాణ రాష్ట్రాల్లో పీకెలాంటి వారి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని టీపీసీసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.పీకె ప్రగతిభవన్ లోకి శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు ఎంట్రీ ఇస్తే రాత్రి అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ విషయం లీక్ ఇచ్చేదాకా సో కాల్డ్ ప్రధాన మీడియా కు ఎవరికీ తెలియదు. టీఆర్ఎస్ లీక్ ఇస్తేనే ఈ విషయం బయటకు వచ్చింది.
పీకె కాంగ్రెస్ లో చేరటం ఖాయం..ఇక టీఆర్ఎస్ కు అసలు సేవలు అందిస్తారా లేదా అన్న చర్చలు సాగుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి కెసీఆర్, కెటీఆర్ లతో సమావేశం అవ్వటం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం షాక్ ఇచ్చారనే అంటున్నారు. పీకె విషయంలో జరుగుతున్న చర్చ...ఆయన టీఆర్ఎస్ అగ్రనేతలతో భేటీ అవటం తెలంగాణ కాంగ్రెస్ నేతలను, శ్రేణులను మరంత గందరగోళంలోకి నెడుతున్నాయని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్ సభతో తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో పీకె వ్యవహారం నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలే తమకు ఒక్కో పీకెలా పనిచేస్తారని..టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నా ఎవరిని పెట్టుకున్నా తమకు ఏమీ కాదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ అకస్మాత్తుగా కాంగ్రెస్ అధిష్టానం ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరపటమే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ గా మారింది.