వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రభుత్వంలోనే కాదు...ఇక ఇప్పుడు పార్టీలో కూడా సూపర్ పవర్ గా మారారనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి పవర్ కట్ అయిందని చెబుతున్నారు. ఇటీవల వరకూ ఆయన ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఆ బాధ్యతలు లేవు. పార్టీ కార్యాలయంలో ఉంటూ విజయసాయిరెడ్డి అన్ని అనుబంధ విభాగాలను చూస్తారని ప్రకటించారు. గత మూడేళ్ల కాలంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ అసలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్స్..ఇతర కమిటీ సభ్యులతో సమావేశం అయిందే లేదని..అలాంటి అనుబంధ విభాగాల బాధ్యతలు అంటే పూర్తిగా పక్కన పెట్టేయటమే అని వైసీపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో సజ్జలకు మాత్రం నేరుగా కర్నూలు బాధ్యతలు చూస్తారు. దీంతోపాటు జిల్లా అధ్యక్షులు, అదే సమయంలో అన్ని జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తల సమన్వయ బాధ్యత కూడా సజ్జలదే.
అంటే పార్టీ వ్యవహారాలు ఏమీ కూడా ఆయన్ను దాటిపోవని అంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డి తరహాలోనే కొన్ని జిల్లాల బాధ్యతలను చూసిన వై వీ సుబ్బారెడ్డికి ఈ సారి విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు వైఎస్ఆర్, తిరుపతి జిల్లాలను అప్పగించటంపై ఆసక్తికర వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అందులో ఒకటి సీఎం జగన్ సొంత జిల్లా..మరొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప రిధిలో ఉండేది. వీళ్లిద్ధరిని కాదని అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఏమైనా చేయగలుగుతారా అన్నది పార్టీ నేతల సందేహం. మంత్రి పదవి ఆశించి భంగపడిన బాలినేని శ్రీనివాసరెడ్డికి నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ప్రాంతీయ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోపాటు బుగ్గన,బొత్స సత్యనారాయణకు కూడా ప్రాంతీయ సమన్వయ భాధ్యతలు అప్పగించారు.