అమిత్ షాకు లేఖ రాయటంలో ఇంత జాప్యం ఎందుకు?
అసలు కోకాపేట భూముల వ్యవహారంలో ఏమి జరిగింది?
చర్చనీయాంశంగా మారిన రేవంత్ వ్యవహారం
'బిజెపి, టీఆర్ఎస్ కుమ్మక్కును బహిర్గతం చేస్తా. వెయ్యి కోట్ల రూపాయల కోకాపేట భూముల స్కామ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా. ఆ ఫిర్యాదు కాపీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ కి ఇస్తా. అప్పుడే వీరి బండారం బయటపడుతుంది. కోకాపేట స్కామ్ ను అడ్డుకుంటారో లేదో తెలిసిపోతుంది.' అంటూ ప్రకటించారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చేసిన అతిపెద్ద ఆరోపణ కూడా ఇదే. రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పి నెల రోజులు కావస్తోంది. ఇప్పటివరకూ ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాకు కోకాపేట భూముల స్కామ్ పై ఫిర్యాదు చేయటం కానీ..ఆ కాపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఇచ్చిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డికి ఈ అంశంపై రాయటానికి ఇంకా లెటర్ హెడ్స్ దొరకలేదా? లేక మరేదైనా కారణం ఉందా?. అసలు కోకాపేట భూముల వ్యవహారంలో ఏమి జరిగింది అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. భూముల వేలం సమయంలోనే తొలుత కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఏకంగా కోకాపేట భూముల వద్ద ధర్నాకు బయలుదేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటంతో ఆయన ఈ అంశంపై స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. బయట నుంచి సంస్థలు ఈ వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని..అత్యంత విలువైన భూములు అన్నీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు చెందిన అస్మదీయ కంపెనీలే కొనుగోలు చేశాయని ఆరోపించారు.
అదే సమయంలో రహదారులతోపాటు ఇతర మౌలికసదుపాయాలు అన్నీ ఒకేలా ఉన్నా ఒక చోట ఎకరం ధర అరవై కోట్ల రూపాయలు పలికి..పక్కనే అత్యంత తక్కువ పలకటం వెనక కూడా స్కెచ్ ఉందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హైకోర్టు తాజాగా కోకాపేటలో అనుమతుల వ్యవహారంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది కానీ..రేవంత్ రెడ్డి మాత్రం గత నెల రోజులుగా ఈ అంశాన్ని పూర్తిగా వదిలేసినట్లు ఉన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చేపట్టిన అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఇలా మధ్యలో వదిలేయటం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ కోకాపేట భూముల వ్యవహారంపై ఏ పార్టీ మాట్లాడదు...ఏ మీడియా పట్టించుకోదు. ఎందుకంటే ఇందులోనూ ఎవరి లెక్కలు వారికున్నాయి. ఒకప్పుడు అసలు హైదరాబాద్ లో భూములు అమ్మటమే తప్పు..భవిష్యత్ తరాల ఆస్తులు ఎలా అమ్ముతారని ప్రశ్నించిన టీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం భూములు అమ్మి దళిత బంధు అమలు చేస్తామని చెబుతోంది.