రేవంత్ రెడ్డి...కాంగ్రెస్ పార్టీలో ఓ కొత్త ఆశ‌

Update: 2021-07-07 12:29 GMT

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా.. లేదా అనే అంశంపై ఇప్పుడే ఓ నిర్ణ‌యానికి రావ‌టం క‌ష్టం. కాక‌పోతే నూతన టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే ఆ పార్టీలో ఓ కొత్త ఆశ‌లు అయితే చిగురింప‌చేస్తున్నారు. నిన్న కాక మొన్న వ‌చ్చిన రేవంత్ కు ఇంతటి కీల‌క ప‌ద‌వి ఏంటి అనే వారూ ఆ పార్టీలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కాబ‌ట్టే ఇప్పుడు క‌నీసం ఈ ఆశ అయినా మిగిలింది అనే వారే ఎక్కువ శాతం. సోనియాగాంధీ అయినా రాహుల్ గాంధీలు కూడా ఎంతో కాలం నుంచి ఉన్న నేత‌ల‌ను కాద‌ని రేవంత్ కు ప‌ద‌వి ఇచ్చారంటే..అస‌లే క‌ష్టాల్లో ఉన్న పార్టీని మ‌రింత కష్టాల్లోకి నెట్టుకుంటారా?. రిస్క్ అయినా స‌రే..అది రేవంత్ తోనే చేద్దామ‌ని వారు అనుకున్నాకే ఇంతటి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాల్లో వ్యూహాల‌తో పాటు ప‌ర్పెక్ట్ కమ్యూనిష‌కేష‌న్ కూడా అత్యంత కీల‌కం. ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అయ్యేలా మాట్లాడ‌టం అత్యంత అవ‌స‌రం. తెలంగాణ‌లో కెసీఆర్ త‌ర్వాత అంత ఆర్ట్ ఉన్న నేత ఖ‌చ్చితంగా రేవంత్ రెడ్డే అని చెప్పొచ్చు. కాంగ్రెస్ నేత‌లంద‌రూ సోనియానే తెలంగాణ త‌ల్లి.. తెలంగాణ త‌ల్లి అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ మాట‌లు వాళ్ళు అనుకోవ‌టం..అన‌టం కాదు...ప్ర‌జ‌లు అనుకునేలా చేయ‌గ‌ల‌గాలి. బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మాట్లాడిన తొలి స‌మావేశంలో రేవంత్ రెడ్డి ఆ ప‌ని స‌క్సెస్ ఫుల్ గా చేశారు. మంచి నీళ్లు ఇచ్చిన వారినే చ‌ల్ల‌గా ఉండ‌మ‌ని దీవించే సంస్కృతి మ‌న‌ది..అలాంటిది అర‌వై ఏళ్ల తెలంగాణ ప్ర‌జ‌ల కోరిక అయిన తెలంగాణ‌ను సాకారం చేసిన సోనియా రుణం తీర్చుకోవ‌ద్దా అని ప్ర‌శ్నించ‌టం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌చేసేలా చేశారు. దీంతోపాటు మా పీకేలు..ఏకె 47లు కార్య‌క‌ర్త‌లే అన‌టం ద్వారా కూడా స్ప‌ష్ట‌మైన సంకేతాలు పంపించార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఏ పార్టీకి అయినా కార్య‌క‌ర్త‌లే బ‌లం. ఎంత పెద్ద నాయ‌కులు అయినా కార్య‌క‌ర్త‌లు లేకుండా చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌దు.

                                    రేవంత్ త‌న వ్యాఖ్య‌ల ద్వారా నాయ‌కుల కంటే తాను కార్య‌క‌ర్త‌ల‌నే ఎక్కువ న‌మ్ముకున్న‌ట్లు సంకేతాలు ఇచ్చారు. అంతే కాదు..ఈ వ్యాఖ్య‌ల ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ నీర‌స‌డిపోయి ఉన్న వారిలో కొత్త జోష్ నింపే ప్ర‌య‌త్నం చేశారు. ఏ పార్టీకి అయినా ఈ సారి తెలంగాణ‌లో అధికారం ద‌క్క‌టం అంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఎందుకంటే ఈ సారి చాలా భిన్న‌మైన ప‌రిస్థితులు ఉండ‌బోతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ‌పై ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నాల్లో ఉంది. మ‌రో వైపు వై ఎస్ ష‌ర్మిల కొత్త పార్టీ పెడుతున్నారు. అయితే ష‌ర్మిల చీల్చే ఓట్లు స‌హ‌జంగానే కాంగ్రెస్ పార్టీవే అయి ఉంటాయ‌నే అంచ‌నాలు ఉన్నాయి. ష‌ర్మిల పూర్తిగా వైఎస్ బ్రాండ్ ను ఉప‌యోగించుకునే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందుకే ఆ పార్టీ ఓట్ల‌కు కొంత అయినా గండిప‌డుతుంద‌నే లెక్క‌లు వేస్తున్నారు. మ‌రో వైపు ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల‌కు సంబంధించి ర‌క‌ర‌కాల క‌స‌ర‌త్తులు ప్రారంభిస్తున్నారు. ఇన్ని స‌వాళ్ళ‌ను అధిగ‌మించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే రేవంత్ రెడ్డి చాలా చాలా చెమ‌టోడ్చాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని..ఇప్ప‌టి నుంచే క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టిస్తూ నేతలు ..కార్య‌క‌ర్త‌ల‌ను క‌దం తొక్కించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఓ సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ పేరు ప్ర‌క‌టించిన త‌ర్వాతే కాంగ్రెస్ శ్రేణుల్లో సానుకూల సంకేతాలే వచ్చాయి.

Tags:    

Similar News