ఇది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరు ఉన్న వారు అంతా దొంగలు అన్న తరహాలో ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తప్పే. అందులో సందేహం లేదు. అయితే ఇంత కంటే దారుణమైన విమర్శలు చేసినవారు...వ్యాఖ్యలు చేసినవారు రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు సూరత్ కోర్ట్ రెండేళ్ల శిక్ష విధించింది. దీనిపై అప్పీల్ చేసుకోవటానికి సమయం ఇచ్చింది. కానీ తీర్పు ఇచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..వెంటనే లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా కోర్ట్ తీర్పు...ఈ నిర్ణయంలో ఉన్న వేగం చూస్తే మాత్రం ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ టార్గెట్ గా బీజేపీ పార్లమెంట్ లో విదేశాల్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అప్పటివరకు పార్లమెంట్ లో మాట్లాడనిచ్చే అవకాశం లేదు అని చెపుతోంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ, అదానీల మధ్య బంధం గురించి గట్టిగా మాట్లాడారు...ఫోటోలు కూడా చూపించారు. చివరకు వీటిని పార్లమెంట్ రికార్డుల నుంచి గురించి కూడా తొలగించారు. భారత్ జోడో యాత్ర తో రాహుల్ గాంధీ కి దేశ వ్యాప్తంగా ఇమేజ్ పెరిగింది అనే అభిప్రాయం ఉంది.
ఈ తరుణంలో రాహుల్ టార్గెట్ గా మోడీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. అదేదో అవినీతి ఆరోపణలు...ఇతర సీరియస్ కేసుల్లో శిక్ష పడి సభ్యత్వం పోతే ఓకే. చట్టం ప్రకారం అంతా జరిగింది అనుకోవచ్చు. రాహుల్ గాంధీ విషయంలో మాత్రం మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళు అందరు దొంగలు అన్నందుకు తీర్పు రావటం...ఆ వెంటనే .సభ్యత్వం రద్దు కావటం చూస్తుంటే ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారనే అభిప్రాయం కలగటం ఖాయం అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వీటి అన్నింటిపై కోర్ట్ ని ఆశ్రయించే ఏర్పాట్లలో ఉంది. కేసు తీవ్రత ప్రకారం చూస్తే దీనిపై ఊరటగా రావటం ఖాయం అని న్యాయ నిపుణులు చెపుతున్నారు. అదే సమయంలో ఈ పరిణామాలు అన్ని రాహుల్ గాంధీ ని హీరో ను చేయటం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన అదానీ-హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై రాహుల్ పెద్ద ఎత్తున ప్రధాని మోడీ ని టార్గెట్ చేయటం కూడా బీజేపీ టార్గెట్ చేసిందే అనే అభిప్రాయం కలుగుతోంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన రాహుల్ గాంధీ పోరాటం కొనసాగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాహుల్ సభ్యత్వ రద్దు నిర్ణయంపై దేశంలోని కీలక పార్టీలు అన్ని కూడా తీవ్రంగా స్పందించాయి. ఇంతకంటే దిగజారడం మరొకటి ఉండదు అంటూ మంది పడుతున్నాయి. మహారాష్త్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అయితే దొంగలను దొంగలు అనటం కూడా తప్పు అయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .