తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీల మాయాజాలం
విద్యార్ధులపై ఏటా కోట్ల రూపాయల భారం
అధికారిక దోపిడీని అడ్డుకోని సర్కార్లు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నర సంవత్సరాలు. ఎక్కడైనా..ఏ కాలేజీ అయినా కోర్సు ప్రకారమే ఫీజు వసూలు చేయాలి.. కానీ ఏపీ, తెలంగాణల్లో మాత్రం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నాలుగున్నర సంవత్సరాల కోర్సుకు ఐదేళ్ళ లెక్కన ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది నిబంధనల వ్యతిరేకం. ఇలా రెండు రాష్ట్రాల్లో ప్రతి ఏటా కోట్లాది రూపాయల మేర స్కామ్ జరుగుతోంది. అయినా పట్టించుకునే నాథుడే లేడు. ఇది ఇప్పటి ప్రభుత్వాల నిర్వాకం కాకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయే తప్ప..విద్యార్ధుల కోణంలో మాత్రం అసలు చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు..ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీజులు కూడా ఎక్కువే. ఓ వైపు ఇతర రాష్ట్రాల కంటే పెద్ద ఎత్తున అధిక ఫీజులు వసూలు చేస్తూ మరో వైపు ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా కోర్సు ఉండని ఆరు నెలలకు అదనంగా ఒక్కో విద్యార్ధి నుంచి దాదాపు ఆరు లక్ష్ల రూపాయల పైనే వసూలు చేయటం చేయటం దారుణం అని విద్యార్ధులు వాపోతున్నారు.
ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఏటా విద్యార్ధుల నుంచి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు దాదాపు 300 కోట్ల రూపాయల మేర అదనంగా వసూలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నిపుణులు చెబుతున్నారు. ఎంబీబీఎస్ కు చెందిన బీ, సీ క్యాటగిరి సీట్లలో ఈ వ్యవహారం సాగుతోంది. సీ క్యాటగిరి తీసుకుంటే ఈ దోపిడీ మరింత అధికంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అసలు కోర్సు లేని కాలానికి కూడా ఫీజు వసూలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. దేశంలోని కొన్ని ప్రతిష్టాత్మక కాలేజీలు అధికారికంగా తమ వెబ్ సైట్ లో పెట్టి మరీ నాలుగున్నర సంవత్సరాలకే ఫీజు వసూలు చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల కాలేజీలు మాత్రం యధేచ్చగా విద్యార్ధుల నుంచి అదనపు సొమ్ము రాబడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన కాలేజీ నాలుగున్నర సంవత్సరాలకే ఫీజు వసూలు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే ఎంతో పేరున్న సంస్థ. దీంతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ల్లో కూడా ఇదే నాలుగున్నర సంవత్సరాలకే ఫీజు వసూలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారుల కమిటీ మాత్రం నాలుగున్నర సంవత్సరాలకే ఫీజు వసూలు చేయాల్సి ఉంటుందని ఫైల్ సిద్ధం చేసినా పై స్థాయిలో మాత్రం అది ఏ మాత్రం ముందుకు కదలటం లేదని చెబుతున్నారు. ఏపీలో మాత్రం అసలు అర్హత లేని ఈ ఆరు నెలల కాలానికి ఫీజు వసూలు అంశంపై అధికారులు దృష్టి పెట్టినట్లు లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.