పొలిటిక‌ల్ రీ ఎంట్రీ...ఎన్టీఆర్ సేఫ్ గేమ్

Update: 2022-04-01 09:45 GMT

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విజ‌యాన్ని ఆస్వాదిస్తున్న ఎన్టీఆర్ రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. ప్ర‌స్తుతం తాను త‌న సినిమా జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాన‌ని...ఇప్పుడు ఈ క్షణాల‌ను మాత్ర‌మే ఆస్వాదించాల‌నుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఐదేళ్ళు..ప‌దేళ్ళ త‌ర్వాత ఏమి అవుతుందో అన్న‌ది ఆలోచించ‌టం క‌రెక్ట్ కాద‌న్నారు. తాను న‌టుడిగా ఈ ప్ర‌యాణాన్ని ప్ర‌స్తుతం ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఆ వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో టీడీపీని తిరిగి అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ ను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాల‌ని కొంత మంది...చంద్ర‌బాబు, లోకేష్ లే స‌రిపోతారు అని మ‌రికొంత మంది వాదిస్తూ ఉంటారు. ఈ త‌రుణంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల‌పై చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా Full Viewమారాయి. చూస్తుంటే ఎన్టీఆర్ రాజ‌కీయాల విష‌యంలో ప్ర‌స్తుతానికి సేఫ్ గేమ్ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లు క‌న్పిస్తోంది. ఏపీలో ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితే 2024లో ఎన్నిక‌లు వ‌స్తాయి. అప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల్లో టీడీపీని చంద్ర‌బాబే లీడ్ చేస్తార‌నటంతో సందేహం లేదు. నారా లోకేష్ కు ఇప్ప‌టికే పార్టీలో ఎన‌లేని ప్రాధాన్య‌త ఉన్నా..నాయ‌కుల నుంచి ఆమోదం (యాక్సెప్టెన్స్) లేద‌నే అభిప్రాయం ఎక్కువ మంది నేత‌ల్లో ఉంది.అందుకే అంద‌రూ చంద్ర‌బాబుతో కొన‌సాగ‌టానికే ఇష్ట‌ప‌డతారు కానీ..లోకేష్ తో ముందుకు సాగ‌టానికి కొంత మంది అయిష్ట‌త చూపుతున్నార‌నే ప్ర‌చారం పార్టీలో ఉంది.

అయినా స‌రే తెర‌వెన‌క లోకేష్..తెర ముందు చంద్ర‌బాబుతోనే పార్టీ ముందుకు సాగుతుంద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న గ‌త కొంత కాలంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ వివాదం త‌లెత్తిన‌ప్పుడు కూడా ఎన్టీఆర్ ఎక్క‌డా ఈ అంశంపై స్పందించ‌కుండా మౌనం దాల్చారు. మహేష్ బాబు, ప్ర‌భాస్ వంటి హీరోలు అమ‌రావ‌తి వెళ్లి సీఎం జ‌గ‌న్ ను క‌ల‌సినా కూడా ఎన్టీఆర్ మాత్రం దూరంగానే ఉన్నారు. కార‌ణాలు ఏమైనా సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం అయితే త‌న సినిమాల‌ను టీడీపీ శ్రేణులుదెబ్బ‌తీస్తాయ‌నే ఉద్దేశంతోనే ఆయ‌న వీటి అన్నింటికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజ‌కీయాల‌పై కూడా అందుకే ఆచితూచి స్పందిస్తూ మ‌రో పదేళ్ళ వ‌ర‌కూ అటువైపు చూసే ఛాన్స్ లేద‌నే సంకేతాలు ఇచ్చారు. అయితే చాన్స్ చిక్కిన‌ప్పుడల్లా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయ‌న రాజ‌కీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూనే ఉంటారు. వాస్త‌వానికి ఇప్ప‌టికిప్పుడు ఎన్టీఆర్ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయ‌న‌ పాత్ర ఎంత‌లేద‌న్నా చంద్ర‌బాబు, నారా లోకేష్ ల త‌ర్వాతే ఉంటుంది. కెరీర్ పీక్ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌టం ద్వారా అన‌వ‌స‌ర వివాదాల‌కు చాన్స్ ఇచ్చిన‌ట్లు అవుతుంద‌నే అభిప్రాయంతో ఎన్టీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా ఆయ‌న మాట‌లు చూస్తుంటే మ‌రో ప‌దేళ్ళ వైపు ఇటు చూసే ఛాన్స్ క‌న్పించ‌టం లేదు అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Tags:    

Similar News