అనిల్ కుమార్ యాదవ్ వీడియోలతో ఆడుకుంటున్న టీడీపీ
2021 డిసెంబర్ కు ప్రాజెక్టు రెడీ అంటూ అసెంబ్లీలో..బయటా ప్రకటనలు
2022 జూన్ కు డెడ్ లైన్ మార్చినా.. అదీ కష్టమే అంటున్న అధికారులు
ఎక్కడో కాదు. అసెంబ్లీలోనే ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మామూలుగా కూడా కాదు..అరిచి మరీ చెప్పారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రైతులకు నీళ్లు ఇస్తాం. మేం దీనికి కట్టుబడి ఉన్నాం అని. అసెంబ్లీలోనే కాదు..అసెంబ్లీ బయట కూడా ఇదే మాట చెప్పారు. ఇప్పుడు ఇదే వీడియోలతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఆడుకుంటోంది. కొబ్బరికాయకు డబ్బులు లేక పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2021 డిసెంబర్ అని ప్రకటించినా తర్వాత ప్రభుత్వం మళ్లీ ఈ డెడ్ లైన్ ను 2022 జూన్ కు మార్చింది. అయితే పోలవరంలో ప్రస్తుతం సాగుతున్న ప్రాజెక్టు పనుల తీరు ప్రకారం చూస్తే 2024 నాటికి కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం కష్టమే అని అదికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అన్ని కాంట్రాక్టర్ల తరహాలోనే పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు కూడా సర్కారు వందల కోట్ల రూపాయల మేర బకాయి పడింది. గతంలో సాగినంత వేగంగా ఇప్పుడు అక్కడ పనులు సాగటం లేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నేతలు అందరూ రివర్స్ టెండరింగ్ ద్వారా 780 కోట్ల రూపాయల మేర ఆదా చేసినట్లు పదే పదే ప్రకటించారు. మరి ఆదా చేసిన డబ్బుతో అయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేయవచ్చు కదా అంటే ప్రభుత్వం తన అవసరాలు అన్నీ తీరిన తర్వాతే ప్రాజెక్టుల సంగతి అన్న తరహాలో వ్యవహరిస్తోంది అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబులా తాము ప్రచారం చేసుకోమని..అయినా కూడా పోలవరంలో పనులు శరవేగంగా సాగుతున్నాయని పలుమార్లు ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన డెడ్ లైన్లలో ఏ ఒక్కటి కూడా అందుకునే ఛాన్స్ లేదని చెబుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి తన పంచుడు పథకాలపై పెట్టినంత ఫోకస్ పోలవరం ప్రాజెక్టుపై పెట్టలేదని ఓ సీనియర్ అధికారి అభిప్రాయం పడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు దోచుకునేందుకు పోలవరం అంచనాలను భారీగా పెంచారని ఆరోపించిన జగన్ అధికారంలోకి వచ్చాక అవే అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని పదే పదే కోరుతున్నారు. మరి అప్పుడు దోపిడీ కోసం అన్న అంచనాలు అధికారంలోకి వచ్చాక సక్రమం ఎలా అయ్యాయో ఎవరికీ తెలియదు. పోనీ కేంద్రం నుంచి అయినా సవరించిన అంచనాలకు ఆమోదం అయినా తెచ్చుకోగలిగారా అంటే అదీ లేదు. సీఎం జగన్ ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా..అదికారులు వివరణలు సమర్పించినా కేంద్రం మాత్రం సవరించి అంచనాలకు ఆమోదం తెలపటం లేదు. అయితే అనుకున్న సమయానికి అన్నా పనుల్లో జరుగుతున్న జాప్యం వల్ల అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని..ఇది రాష్ట్ర ఖజనాపై అదనపు భారం మోపటం ఖాయం అంటున్నారు. రివర్స్ టెండరింగ్ లో ఆదా చేశామని చెబుతున్న మొత్తాన్ని కూడా ఈ అంచనాలను సవరింపులో సర్దుబాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని..రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ప్రతిదీ రాజకీయం అన్న తరహాలోనే సాగుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓ వైపు కేంద్రం పెంచిన అంచనాలను ఆమోదించటం లేదు..రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. ఈ తరుణంలో సర్కారు కొత్త డెడ్ లైన్ ఎప్పటికి పెడుతుందో వేచిచూడాల్సిందే.