Full Viewటీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆయన దూకుడు మరోసారి దెబ్బకొట్టింది. ప్రశాంత్ కిషోర్ విషయంలో ఆయన సోమవారం నాడు చేసిన వ్యాఖ్యలు తెల్లారేసరికి రివర్స్ అయ్యాయి. ఈ వ్యవహారం ఆయనకు ఖచ్చితంగా షాక్ లాంటిదే. చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు గతానికి భిన్నంగా ప్రశాంత్ కిషోర్ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. మధు యాష్కీ ఒక్కరే కాస్త భిన్నంగా మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో చాలా దూకుడు చూపించారు. టీఆర్ఎస్ తో ఉన్న ఒప్పందం రద్దు చేసుకునేందుకే ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చారని...కాంగ్రెస్ లో చేరాక ఆయన కాంగ్రెస్ కార్యకర్త అవుతారన్నారు.
ప్రశాంత్ కిషోర్, తాను హైదరాబాద్ లో సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ టీఆర్ఎస్ ఓడిపోతుందనే విషయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అసలు పీకె కాంగ్రెస్ లో చేరిక విషయంలో ఎలాంటి స్పష్టత లేకముందే రేవంత్ ఇంత దూకుడు చూపించటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకులకు ఇది ఓ అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే.