వెంట లింగమనేని రమేష్ కూడా!

Update: 2026-04-14 06:33 GMT

హాట్ టాపిక్ గా మారిన వీళ్లిద్దరి టూర్ !

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారదర్శకత గురించి గతంలో పదే పదే చెప్పేవాళ్ళు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా చేపట్టిన సింగపూర్ రహస్య పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన సింగపూర్ టూర్ విషయం బయటకు చెప్పకుండా ఎందుకు రహస్యంగా ఉంచారు అన్నది చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సింగపూర్ బయలుదేరి వెళ్లినట్లు బీజేపీ ఎంపీ ఒకరు వెల్లడించారు. లోక్ సభలో...రాజ్య సభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు కూడా ఆయన సింగపూర్ లోనే ఉన్నారు అని...అందుకే అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నేతలు పాల్గొన్న వేడుకల్లో ఆయన పాల్గొనలేదు అని చెపుతున్నారు.

                                      జనసేన తరపున మరో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన విదేశీ పర్యటన విషయం బయటకు రాకుండా నాలుగు నుంచి ఐదు రోజులు సింగపూర్ లో ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ తో పాటు వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కూడా ఆయన వెంట ఈ టూర్ లో ఉన్నట్లు చెపుతున్నారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎక్కడంటే అక్కడకు వెళ్లొచ్చు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా ఉండి ఎందుకు ఈ టూర్ ను రహస్యంగా ఉంచినట్లు అన్నదే ఇప్పుడు ఎవరికీ అర్ధం కానీ విషయం. మంత్రులు వ్యక్తిగత పర్యటనలు, ఫ్యామిలీ టూర్లకు విదేశీ పర్యటనలకు వెళ్లినా కూడా కేంద్రం నుంచి పొలిటికల్ కియరెన్సు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయా మంత్రుల విదేశీ టూర్ అధికారికంగా...లేక ప్రైవేట్ పర్యటన అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జీవో కూడా జారీ చేస్తారు.

                                    Full Viewకానీ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజా సింగపూర్ పర్యటనకు సంబంధించి ఎలాంటి జీవో జారీ చేసినట్లు కూడా ప్రభుత్వ వెబ్ సైట్ లో లేదు. అంటే ఈ జీవో ను కూడా రహస్యంగా పెట్టినట్లు ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. జనసేన తరపున లింగమనేని రమేష్ కు రాజ్య సభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న వేళ వీళ్లిద్దరి రహస్య టూర్ వెనక ఎన్ని లావాదేవీలు ...ఎన్ని డీల్స్ ఉన్నాయో బయటకు రావాల్సి ఉంది అని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించటం విశేషం. వీళ్లిద్దరి మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో దీనికి సంబదించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Tags:    

Similar News