గత కొన్ని దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కి డిమాండ్ తగ్గబోతోందా?. అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐటి రంగంలో అనిశ్చితి ఏర్పడింది. అమెరికా ఫస్ట్ నినాదంతో తమ దేశంలో ఎక్కువ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల విషయంలో కూడా అమెరికా సర్కారు ఎన్నో ఆంక్షలు విధించింది. దీంతో గత కొంత కాలంగా అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఎక్కువ మంది విద్యార్థులు డోనాల్డ్ ట్రంప్ ఉండేది నాలుగేళ్లే కదా...తర్వాత ఐటి రంగంలో ఉద్యోగాలు...అమెరికాలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది అని లెక్కలు వేసుకున్నారు.
తొలుత డోనాల్డ్ ట్రంప్ విషయంలో వేసుకున్న లెక్కలు బాగానే ఉన్నాయనుకున్నా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ తో ఐటి రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది నెలల క్రితం ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన టూల్స్ దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐటి రంగం కంపెనీ షేర్లు కుప్పకూలేలా చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఇది కొనసాగింది. మరో వైపు ఏఐ కారణంగా ఇప్పటికే ఐటి రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పోతున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సిఎస్ఈ లో స్పెషలైజ్డ్ బ్రాంచ్ లు అయిన ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర విభాగాలకు డిమాండ్ తగ్గకపోయినా కూడా కోర్ సిఎస్ఈ , ఐటి, కంప్యూటర్ ఇంజనీరింగ్, డేటా అనాలసిస్ తదితర విభాగాలకు డిమాండ్ పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు చెపుతున్నారు.
ఉదాహరణకు ఏఐ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఒక కంపెనీకి వంద మంది సాఫ్ట్ వేర్ డెవలపర్లు, ఇంజినీర్లు అవసరం అయితే ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో కేవలం పది మంది మాత్రమే సరిపోతారు అని ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న నిపుణులు చెపుతున్నారు. ఈ లెక్కన ఈ సారి సిఎస్ఈ కు డిమాండ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు సిఎస్ఈ లోనే స్పెషలైజ్డ్ బ్రాంచ్ ల్లో సీటు దక్కాలంటే మాత్రం ఇంజనీరింగ్ అగ్రికల్చరల్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి ర్యాంక్ వస్తే తప్ప అది సాధ్యం కాదు అన్న విషయం తెలిసిందే. సహజంగా స్పెషలైజ్డ్ బ్రాంచ్ లకు డిమాండ్ భారీ ఎత్తున ఉంటుంది..అదే సమయంలో మంచి ర్యాంక్ లు వస్తే తప్ప ఈ సీట్లు దక్కటం కూడా అంత ఈజీ కూడా కాదు. మరో కీలక విషయం ఏమిటి సిఎస్ఈ లో కోర్ ఇంజనీరింగ్ చేసే వాళ్లకు భవిష్యత్ లో ఉద్యోగాలు వచ్చినా కూడా గతంలో లాగా వేతనాలు అంత భారీగా ఉండే అవకాశం ఏ మాత్రం ఉండదు అని చెపుతున్నారు. భారీ వేతనాలు రావాలంటే మాత్రం ప్రత్యేక నైపుణ్యాలు ఉంటే తప్ప అది సాధ్యం కాదు అని..రాబోయే రోజుల్లో ఐటి జాబ్ మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున మార్పులు రావటం ఖాయం అని చెపుతున్నారు.