ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఇటీవలే రెండు సంవత్సరాలు పూర్తి అయింది. అంటే నికరంగా ఈ ప్రభుత్వానికి ఉన్నది మరో రెండేళ్ల సమయం మాత్రమే. ఏడాది ముందు నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరం మొదలవుతుంది అనే విషయం తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కారు దూకుడు చూస్తుంటే ఈ సారి జమిలి ఎన్నికలు అని...రకరకాల ఆలోచనలు ఉండటంతో ఒక ఆరు నెలల ముందు కూడా ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో 11 సీట్లకు పరిమితం అయిన వైసీపీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారును వివిధ విషయాల్లో ఢీకొడుతున్న తీరు మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంత త్వరగా వైసీపీ కోలుకుని ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వస్తుంది అని ఎవరూ ఊహించలేదు. అయితే దీనికి ప్రధాన కారణం కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన తెలుగు దేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే. కూటమి ప్రభుత్వంలో కూడా గత వైసీపీ హయాంలో హవా చెలాయించిన ఐఏఎస్ అధికారులకు పెద్ద పీట వేయటం...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నడుచుకుంటుండటంతో టీడీపీ నాయకులు..క్యాడర్ లో ఈ రెండేళ్లలోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది.
మరో వైపు గతానికి భిన్నంగా ఈ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబినెట్ లో ఎక్కువ మంది కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. ఒక్క తెలుగు దేశం పార్టీ తరపున క్యాబినెట్ లో ఉన్న వాళ్లలో 13 మందిపైగా మంత్రులు కొత్తవాళ్లే. ఇది అంతా కూడా వ్యూహాత్మకంగా చేశారు అనే ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. ఇదే క్యాబినెట్ తో ఎన్నిలకు వెళితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు అనే చర్చ టీడీపీ వర్గాల్లో కూడా ఉంది. ఇప్పుడు మంత్రులుగా ఎవరు ఉన్నా అన్ని శాఖలపై మాత్రం పెత్తనం కొంతమంది దే నడుస్తుంది అనే ప్రచారం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల ఫైల్స్ విషయంలో ఎలా ఉన్నా కూడా జిల్లాల పరంగా చూసుకుంటే రాజకీయంగా పవర్ ఫుల్ వ్యక్తులు లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం ఎక్కువ మంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అటు నాయకులతో పాటు క్యాడర్ లో జోష్ నింపేందుకు డైనమిక్ గా ఉండే వాళ్లకు క్యాబినెట్ లో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది అని ఎక్కువ మంది నేతలు అబిప్రయపడ్తున్నారు.
మరో వైపు క్యాబినెట్ లో ఉన్న ఎక్కువ మంది మంత్రుల పనితీరు కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు అని...ఇందుకు కొంత మంది స్వయంకృతాలు కొన్ని అయితే..మరికొంత మంది విషయంలో మాత్రం కంట్రోల్స్ వేరే చోట ఉండటం వల్ల వాళ్ళు సొంతంగా ఏమి చేయలేకపోతున్నారు అని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. వివిధ అంశాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్ట్ నెలలో లేదు అంటే...దసరా నాటికీ ఎలక్షన్ క్యాబినెట్ ను సిద్ధం చేసే అవకాశం ఉంది అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో కొంత మందిని తొలగించి ..ఫస్ట్ టైం ఛాన్స్ మిస్ అయిన వాళ్లలో రెండవ విడతలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఈ నెలాఖరు కు కేంద్ర క్యాబినెట్ లో కూడా మార్పులు, చేర్పులు జరగటం ఖాయం. ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొంత మంది కొత్త వాళ్లకు ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. ఇవి అన్నీ పూర్తి అయిన తర్వాత వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో మార్పులు చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఫస్ట్ టైం క్యాబినెట్ లో చోటు దక్కించుకున్న వాళ్లలో అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, సుభాష్, సవిత, టి జీ భరత్, బి సి జనార్దన్ రెడ్డి , నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యా రాణి, డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు ఉన్నారు.
కొత్తగా క్యాబినెట్ మంత్రులు అయిన వారిలో ఎక్కువ మంది పనితీరు ఏ మాత్రం ఆశాజనంగా లేదు అన్నది టీడీపీ నాయకుల మాట. మరో కీలక విషయం ఏమిటి అంటే కీలక శాఖలు చూస్తున్న రెవిన్యూ, విద్యుత్, ఆర్థిక శాఖల మంత్రులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్వహిస్తున్న రెవిన్యూ శాఖ పైనే ప్రజల నుంచి అత్యధిక ఫిర్యాదులు ఉన్నాయి. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ఆ శాఖలో పనులు మాత్రం కావటం లేదు అనేది ప్రధాన విమర్శ. మరో వైపు మంత్రి పై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీడియా లో కూడా ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరో కీలక శాఖ విద్యుత్ శాఖ విషయానికి వస్తే విద్యుత్ శాఖ మంత్రి పేరుకు గొట్టిపాటి రవికుమార్ అయినా ఆయన శాఖకు చెందిన నిర్ణయాలు మాత్రం ఎక్కడో జరుగుతున్నాయి అని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. కాకపోతే మంత్రి పేషీ సిబ్బంది మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక శాఖ విషయంలో వచ్చిన విమర్శలు..ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. కూటమి ప్రభుత్వంలో కూడా బిల్స్ అన్నీ కూడా వైసీపీ నేతలు చెప్పిన వాళ్లకు...వాళ్ళ మనుషులకే క్లియర్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరో కీలక మంత్రి పరిశ్రమల శాఖకు చెందిన టి జీ భరత్. ఆయన వివాదరహితుడు. అయితే అసలు రాష్ట్రంలో పరిశ్రమల శాఖను పూర్తిగా మంత్రి నారా లోకేష్ తన అధీనంలోనే పెట్టుకున్నారు అనే అభిప్రాయం అటు అధికారులతో పాటు టీడీపీ నేతల్లో కూడా ఉంది. రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చినా అది తమ వల్లే అని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో కొన్ని పరిశ్రమల ప్రారంభోత్సవం..శంకుస్థాపనలకు కూడా మంత్రిని పిలవటం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత పై ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాగే ఉంటే తాను హోమ్ శాఖ తీసుకుంటాను అంటూ ఆయన ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించి కలకలం రేపారు. అయితే త్వరలో జరిగే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో అనగాని పై వేటు పడుతుందా లేక శాఖ మారుతుందా అన్నది వేచిచూడాల్సిందే. పయ్యావుల కేశవ్ శాఖలో ఎలాంటి మార్పు ఉండదు కానీ..ఆయనపై ప్రభుత్వ పెద్దలు నిఘా పెట్టినట్లు చెపుతున్నారు. మరో కీలక మంత్రి నారాయణ వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ పెద్దలకు..ఆయనకు ఈ మధ్య కాలంగా గ్యాప్ బాగా పెరిగినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మరి ఆయన చూస్తున్న మున్సిపల్ శాఖ మార్చుతారా...అక్కడే కొనసాగిస్తారా అన్నది చూడాలి. పునర్వ్యవస్థీకరణ సమయంలో వేటు పడే ఛాన్స్ ఉన్న వాళ్ళ పేర్లలో మంత్రులు పార్ధసారధి, ఆనం రాంనారాయణ రెడ్డి పేర్లు ముందు వరసలో ఉన్నాయని చెపుతున్నారు. వీళ్ళతో పాటు మరికొంత మందిపై కూడా వేటు పడటం ఖాయం అన్నది పార్టీ వర్గాలు చెపుతున్న మాట. కొత్తగా మంత్రి ఛాన్స్ వచ్చే వాళ్లలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా ఉంది. ఆయనతో పాటు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి కూడా ఛాన్స్ ఉంటుంది అని చెపుతున్నారు. అయితే కేంద్రంలో దక్కే సహాయ మంత్రి ఛాన్స్ ఏమైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి దక్కితే మాత్రం అప్పుడు ఆమెకు ఛాన్స్ ఉండదు.