పవన్ ఆ ఫార్ములాను తెలంగాణలో ఉపయోగించరా!

Update: 2022-05-22 06:33 GMT

Full Viewఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ మాట చెప్పారు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్నారు. తాజాగా కూడా మరోసారి ఈ అంశాన్ని పునరుద్ఘాటించారు. ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లే అవుతోంది. ఈ మూడేళ్ళ సమయంలో జగన్ తన పాలన ద్వారా చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో సందేహం లేదు. ఇసుక దగ్గర నుంచి మొదలుపెడితే రహదారులు...విద్యుత్ సమస్య ఇలా చాలా అంశాలే ఉన్నాయి. ఏపీలో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎలాగైనా ఓడించాలి అని పవన్ కళ్యాణ్ అనుకోవటంలో తప్పులేదు. కానీ ఆయన తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. మూడేళ్ల జగన్ పాలనలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న జగన్..మరి తెలంగాణ వరకూ వచ్చేసరికి మాత్రం కెసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు.

అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఓ ఫార్ములా...తెలంగాణ ఎన్నికలకు ఓ ఫార్ములానా?. తెలంగాణలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పై కూడా గ్యారంటీ ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తనకు ప్రతి నియోజకవర్గంలో ఓ ఐదు వేల వరకూ ఓట్లు ఉంటాయని..తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి..తెలంగాణలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి పవన్ కళ్యాణ్ సహకరిస్తారా అన్న కోణంలో చర్చ సాగుతోంది. అయితే ఆయన ఎవరితో కలసి ముందుకు సాగుతారో తేలితే కానీ దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. పలు పార్టీలు తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త కొత్త శక్తులను ప్రవేశపెట్టి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News