మళ్లీ అదే గందరగోళం. ఓ సారి ఢిల్లీ పెత్తనం ఏంది అంటారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి రోడ్డు మ్యాపు రావాలంటారు. పార్టీనేమో పవన్ కళ్యాణ్ ది...రోడ్డు మ్యాప్ బిజెపిదా?. ఏపీలో సాంకేతికంగా ఒకే ఒక్క సీటు ఉన్న జనసేన ఏకంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. అంతే కాదు..ఏకంగా దీని కోసం ఇప్పటికే పలు హామీలు కూడా ఇచ్చేశారు. ఆశ ఉండటం..లక్ష్యం ఉండటం తప్పేమీకాదు. తన పార్టీకి సంబంధించిన రోడ్డుమ్యాప్ ఏదో తానే వేసుకోలేని వ్యక్తి.. తాను మాత్రం అందరినీ నేను దారి చూపిస్తా..నా వెంట నడవండి అని ప్రకటిస్తున్నారు. అంతే కాదు..అసలు బిజెపి ఏమని రోడ్డు మ్యాప్ ఇస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో మోసం. రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, భారీ ఓడరేవుతోపాటు ఎన్నో విభజన హామీలను తుంగలో తొక్కిన పార్టీ అది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన వైసీపీ కూడా విభజన హామీల విషయంలో సాధించింది ఏమీలేదు. ఆ ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కన్పించటం ఖాయం. కానీ ఏపీని దారుణంగా మోసం చేసిన పార్టీల్లో బిజెపి ముందువరసలో ఉంటుంది. అలాంటి పార్టీ రోడ్డు మ్యాప్ ఇస్తే దాని ప్రకారం వెళతాననటానికి ఇక ప్రత్యేకంగా జనసేన ఎందుకు అన్న ప్రశ్న ఎవరిలో అయిన తలెత్తటం సహజం.
బిజెపి పెద్దలకు. ఏపీ సీఎం జగన్ కు ప్రస్తుతానికి సత్సంబంధాలు ఉన్నాయి. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లోనూ ఒక సీటు బిజెపి పెద్దల కోసం రిజర్వ్ చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బిజెపి ఏ విషయంలో కోరుకుంటే ఆ విషయంలో వైసీపీ మద్దతు పార్లమెంట్ లోపలా..బయటా ఇస్తుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లు వైసీపీని గద్దె దించేందుకు బిజెపి అసలు రోడ్డు మ్యాప్ ఇస్తుందా?. అందులో వాస్తవికత ఉంటుందా? అన్న చర్చ కూడా సాగుతోంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల అందులోనూ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మంచి మెజారిటీతోనే బిజెపి తిరిగి విజయం దక్కించుకుంది. అలాంటి పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం జగన్ తో వచ్చే ఎన్నికల్లో ఘర్షణకు దిగుతుందా?. ఈ సంగతి పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రణాళిక ఏమిటో తాను వేసుకోవాలి..కలసి వచ్చేవాళ్లు ఉంటే వారితో కలసి సాగాలి.
కానీ ఏకంగా తనకు రోడ్ మ్యాప్ వేరే పార్టీ ఇస్తుందని బహిరంగ సభలో ప్రకటించటం రాజకీయాల్లో ఓ హైలెట్ గా నిలవటం ఖాయం. కొద్ది కాలం క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ సభలో జనసేనతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ రెండు వైపులా ఉండాలి కానీ..వన్ సైడ్ లవ్ సాధ్యం కాదు అంటూ వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు మాటలు ఆలకించారో ఏమో కానీ..మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా లవ్ సిగ్నల్ బహిరంగ వేదిక నుంచే పంపారు. సహజంగా ప్రేమలో షరతులు ఉండకూడదనుకుంటారు. కానీ ఇక్కడ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రేమకు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతోంది. సొంత రోడ్డు మ్యాప్ తో పోటీకి ప్రణాళిక లేకుండానే ఆయన ఏకంగా సీపీఎస్ రద్దుతోపాటు పది లక్షల రూపాయలతో యువతకు ప్రత్యేక తెస్తామని ప్రకటించారు.