నీలం సాహ్నికి సబ్జెక్ట్ లతో కూడిన సీఎం 'ముఖ్య సలహాదారు' పోస్టు
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కోరితెచ్చుకున్న మఖ్య సలహాదారు అజయ్ కల్లాంను ఇటీవలే సబ్జెక్ట్ లు అన్నీ తీసేసి అవమానించింది. దీనిపై మీడియాలో అజయ్ కల్లాంకు అవమానం అంటూ వార్తలు రావటంతో రిటైర్ అయిన వాళ్లకు సబ్జెక్ట్ లు ఇవ్వకూడదని చెప్పారని..అందుకే అలా చేసినట్లు అనధికార లీక్ లు ఇఛ్చింది సీఎంవో. ఇది జరిగి ఎన్నో రోజులు కాలేదు. కానీ ఇప్పుడు మరి రిటైర్ కాబోతున్న సీఎస్ నీలం సాహ్నికు సబ్జెక్ట్ లు ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 31న రిటైర్ కానున్న నీలం సాహ్నిని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించారు. ఇప్పటికే అజయ్ కల్లాం ఆ పోస్టులో ఉన్నారు. అంటే ఒక్క ముఖ్యమంత్రికి ఇద్దరు ముఖ్య సలహాదారులు అన్న మాట. ఈ మేరకు జీవో కూడా ఇఛ్చారు. అందులోనే నీలం సాహ్నికి ఆరోగ్యంతోపాటు కోవిడ్ 19 మేనేజ్ మెంట్, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, విభజన అంశాలు, పరిపాలనా సంస్కరణలు, గ్రామ, వార్డు సచివాలయాల బలోపేతం వంటి అంశాలు ఉన్నాయి.
వీటితోపాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలతోపాటు ముఖ్యమంత్రి సమయానుగుణంగా కేటాయించే సబ్జెక్ట్ లు చూస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. అజయ్ కల్లాం దగ్గర నుంచి తప్పించిన సబ్జెక్ట్ ల్లో ఎక్కువ భాగం ప్రవీణ్ ప్రకాష్ కే వెళ్ళాయి. మరి అప్పట్లో రిటైర్ అయిన వాళ్ళకు సబ్జెక్ట్ లు ఉండకూడదని వాదించిన వారు ఇఫ్పుడు నీలం సాహ్నికి మరి అన్ని సబ్జెక్ట్ లు ఎలా కేటాయించినట్లు?. అంటే అప్పుడు ఉద్దేశపూర్వకంగానే అజయ్ కల్లాంను పక్కకు తప్పించారనే అంశం తేటతెల్లం అయిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సబ్జెక్ట్ లు తీసేసినా అజయ్ కల్లాం సీఎం జగన్ నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటున్నారు. మరి మరో 'ముఖ్య' సలహాదారు వచ్చాక ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.