ఇది ఎన్టీవీ యాజమాన్యం తీరు
ట్రాన్స్ స్ట్రాయ్ కో నీతి..కోస్టల్ ప్రాజెక్ట్స్ కో నీతి
ఎన్టీవీ. తెలుగులో ప్రధాన ఛానల్. నిత్యం వందల సంఖ్యలో వార్తలు ప్రసారం చేస్తుంది. కానీ ఆ ఛానల్ పై ఏదైనా వార్త రాస్తే చాలు కేసులే. ఇప్పటికే ఈ తరహాలో 'తెలుగుగేట్ వే.కామ్'పై రెండు కేసులు పెట్టింది. ఆధారాలతో సహా వార్తలు రాసినా సరే..కావాలని కేసులు పెడుతూ వేధించే ప్రయత్నం. ముందు తన వాళ్లతో వార్తలు తీసేయాలని కోరటం..సాధ్యం కాదని చెప్పిన వెంటనే కేసులు పెట్టడం. తాజాగా కోస్టల్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. కోస్టల్ కోస్టల్ ప్రాజెక్ట్స్ అధినేత సబ్బినేని సురేంద్ర ఎన్టీవీ చౌదరి వియ్యంకుడు. ఈ విషయాన్ని హెడ్ లైన్ లో ప్రస్తావించటం జరిగింది. ఎన్టీవీ చౌదరికి సురేంద్ర వియ్యంకుడు అనేది వంద శాతం వాస్తవం. కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటూ కేసు పెట్టింది ఎన్టీవీ. కానీ ఇందులో ఒక శాతం కూడా తప్పులేదు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే వార్త వెబ్ సైట్ లో పోస్టు చేయటం జరిగింది తప్ప..మరొకటి కాదు.
ఇదే ఎన్టీవీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీపై, ఆయన నివాసాలపై సీబీఐ దాడులు చేస్తే విస్తృతమైన కవరేజ్ ఇచ్చింది. ప్రత్యేక షోలు చేసింది. అందులో తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ అదే తరహాలో కోస్టల్ ప్రాజెక్స్ 4700 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేస్తే, నిధులను దారిమళ్లిస్తే ఆ విషయాలను సీబీఐ అధికారికంగా ప్రకటిస్తే దానికి సంబంధించిన వార్త ఎన్టీవీలో కనీసం ప్రసారానికి నోచుకోలేదు. ఇది ఎందుకు?. అంటే యాజమాన్యానికి ఆయనతో ఉన్న బంధుత్వమే కారణం. అంటే మన బంధువులు ఎన్ని వేల కోట్ల రూపాయాలు స్కామ్ లు చేసినా ఆ వార్తలను 'దాచేసే' ప్రయత్నం చేసుకోవాలి.
కానీ సీబీఐ ఎప్ ఐఆర్ ఆధారంగా వార్తలు రాసిన వారి మీద మాత్రం కేసులు పెట్టాలి. ఇదీ ఎన్టీవీ తీరు. స్వయంగా వార్తను దాచేసే ప్రయత్నం చేయటం కాదు..తెరవెనక కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగిన విషయం మీడియా సర్కిళ్లలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. తెలుగు గేట్ వే. కామ్ లో కోస్టల్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన రాసిన వార్తకు కట్టుబడి ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వటం జరిగింది. ఓ న్యూస్ ఛానల్ నడుపుతూ, నిజాలు రాసినా సరే ఓ న్యూస్ వెబ్ సైట్ పై పదే పదే కేసులు వేయటం ఎన్టీవీకే చెల్లింది.