జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డికి పగ్గాలు!
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ పీసీసీ ప్రెసిడెంట్ గా నిలిచిపోనున్నారు. ఆయన జమానాలో జరిగిన ఎన్నికల్లో అన్నీ ఓటములే. చివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచిన హుజూర్ నగర్ సీటులో తన భార్యను నిలబెట్టి కూడా తిరిగి గెలిపించలేకపోయారు. దీంతోపాటు ఉత్తమ్ కుమార్ పై సొంత పార్టీ నేతలే అధికార పార్టీతో కుమ్మక్కు అయ్యారనే విమర్శలు చేస్తున్నారు. దీని వెనక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ హయాంలో పెద్ద ఎత్తున స్కామ్ చేశారని...300 కోట్ల రూపాయాలపైన నిధుల దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ నివేదికలు ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి కెసీఆర్ పలుమార్లు ప్రకటించారు. రెండవసారి గెలిచాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కెసీఆర్ రెండవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావస్తోంది..కానీ ఇప్పటివరకూ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మళ్ళీ ఆ స్కామ్ ఊసెత్తలేదు సీఎం కెసీఆర్. అంటే స్కామ్ లను రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు...ప్రత్యర్ధి పార్టీ నేతలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ఇలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
దేశమంతటా ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందనే కోణం కాకుండా దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందటం ఎలా అన్నదే నేతల లక్ష్యంగా మారుతోంది. డిసెంబర్ లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణలో ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. అధికార టీఆర్ఎస్ ఎలాగైనా మళ్ళీ మేయర్ పీఠం దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దుబ్బాక ఎమ్మెల్యే సీటును అధికార టీఆర్ఎస్ నుంచి దక్కించుకున్న బిజెపి ఎక్కడ లేని నూతనోత్సాహంతో దూకుడు చూపుతోంది. బిజెపి, జనసేనలు కలసి జీహెచ్ఎంసీ బరిలో దిగనున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ పరిస్థితి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడవ స్థానానికే పరిమితం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ తన వంతు ప్రయత్నాలను చాలా దూకుడుగా చేస్తోంది. బిజెపి తెరవెనక చేయాల్సిన పనులు అన్నీ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ లో మాత్రం అత్యంత కీలకమైన ఈ ఎన్నికల విషయంలో పెద్దగా జోష్ ఉన్నట్లు కన్పిచంటం లేదు.
ఏదో ఉన్నామంటే ఉన్నాం అనే తరహాలో వ్యవహరం సాగుతోంది. ఎవరెన్ని చెప్పినా జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బిజెపిల మధ్యే అని చెప్పకతప్పదు. అందుకే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే ఈ ఫెయిల్యూర్ ను కూడా జమ చేసి నూతన పీసీసీ అధ్యక్షుడికి ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించినా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్లానింగ్ కు అంత సమయం లేదు. అందుకే ఇవి కూడా పూర్తయిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారని చెబుతున్నారు. బిజెపి దూకుడు నేపథ్యంలో కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తే తప్ప ప్రయోజనం ఉ:డదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కొత్తగా వచ్చే అధ్యక్షుడు ప్రజలకు భరోసా కల్పించగలిగితేనే కాంగ్రెస్ తెలంగాణలో తన సత్తాను చాటుకోగలదని చెబుతున్నారు. అంతే కాదు..బిజెపికి వలసలు లేకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కొత్త పీసీసీ అధ్యక్షుడిపై ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. బిజెపి దూకుడుని తట్టుకుని నిలబడాలంటే రేవంత్ రెడ్డి లాంటి దూకుడు నేతే అవసరం అన్నది కొంత మంది వాదన. మరి అధిష్టానం వ్యూహాలకు అనుగుణంగా ముందుకెళుతుందా లేదా పాత పద్దతులనే అనుసరిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే.