పోలవరంలో 912 కోట్లతో కొత్త లిఫ్ట్ మతలబు ఏంటో!

Update: 2021-04-19 15:31 GMT

సడన్ గా తెరపైకి ప్రతిపాదన

అస్మదీయుడికి మేలు చేయటం కోసమేనా?

పోలవరం ప్రాజెక్టుపై కొత్త లిఫ్ట్. అది కూడా 912 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో. అకస్మాత్తుగా ఈ ప్రతిపాదన ఎందుకు తెరపైకి వచ్చింది. అస్మదీయ కాంట్రాక్టర్ కు మేలు చేయటానికేనా?. అంటే ఔననే అంటున్నాయి సాగునీటి శాఖ వర్గాలు. వాస్తవంగా గతంలో ఈ ప్రతిపాదన లేదు. కానీ సర్కారు తాజాగా జనవరి-ఏప్రిల్ నెలల్లో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కరవు పీడిత ప్రాంతాలకు నీరు అందించేందుకు అంటూ ఈ లిఫ్ట్ ను తెరమీదకు తెచ్చారు. అయితే ఈ నాలుగు నెలల్లో ఈ లిఫ్ట్ ద్వారా ఎంత నీరు తరలిస్తారు..ఎన్ని ఎకరాలకు మేలు చేకూరుతుంది అనే అంశాలు ఏమీ లేకుండా జీవో అయితే జారీ చేశారు.

అయితే ఈ లిఫ్ట్ కు అయ్యే వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఓ వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టులు కూడా నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. అసలు కీలక పోలవరం ప్రాజెక్టు అంచనాల విషయంలోనే కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇన్ని అనిశ్చితుల మధ్య సర్కారు సడన్ గా పోలవరం పై లిఫ్ట్ ప్రాజెక్టు ..అది కూడా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో తలపెట్టడం అంటే..ఇది కీలక కాంట్రాక్టర్ 'డిజైన్' అని అధికారులు చెబుతున్నారు. సహజంగా ఈ పనులు కూడా 'డిజైన్' చేసిన కాంట్రాక్టర్ కే దక్కుతాయని..ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. లిఫ్ట్ ల ద్వారా అవినీతిని లిఫ్ట్ చేయటంలో ఓ సంస్థ దేశంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News