నారా లోకేష్‌...ఎక్క‌డ ఆ జ‌గ‌న్ సంచ‌ల‌న స్కామ్ లు?!

Update: 2022-07-06 08:50 GMT

Full Viewతెలుగుదేశం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మ‌హానాడు సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేమిటి అంటే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సంబంధించి రెండు భారీ స్కామ్ లు ఉన్నాయ‌ని..ప‌క్కా ఆధారాల‌తో వీటిని బ‌య‌ట‌పెట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌హానాడు స‌మ‌యంలో ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తే ఫోక‌స్ అంతా ఆటువైపు వెళుతుంద‌ని మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. స‌రే మ‌హానాడు అయిపోయి న‌ల‌భై రోజులు కావ‌స్తున్నా నారా లోకేష్ ఇప్పటి వ‌ర‌కూ జ‌గ‌న్ కు చెందిన ఆ రెండు స్కామ్ ల ఊసెత్త‌టం లేదు. అస‌లు నారా లోకేష్ ద‌గ్గ‌ర స‌మాచారం లేదా..లేక ఉండి కూడా మ‌రేదైనా కార‌ణంతో వాటిని బ‌య‌ట‌కు చెప్ప‌కుండా ఆపేస్తున్నారా అన్న చ‌ర్చ కూడా పార్టీ నేత‌ల్లో సాగుతోంది. ఆయ‌న త‌నంత‌ట తాను గా ఈ విష‌యంపై మీడియాతో మాట్లాడి మౌనంగా ఉండ‌టంతో దీనిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

సినిమా విడుద‌ల‌కు ముందు విడుద‌ల చేసే టీజ‌ర్..ట్రైల‌ర్ త‌ర‌హాలో నారా లోకేష్ భారీ స్కామ్ ల‌పై కూడా టీజ‌ర్ వ‌దిలారు. ఇప్పుడు అస‌లు సినిమాయే ఉందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి. సీఎం జ‌గ‌న్ కు సంబంధించి ప‌క్కా ఆధారాల‌తో స్కామ్ లు బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌కటించి..మౌనంగా ఉండ‌టంతో త‌ప్పుడు సంకేతాలు పంపిన‌ట్లు అవుతుంద‌నే అభిప్రాయం పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా..అప్ప‌టి ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ రావు కూడా ప్ర‌ధాని మోడీకి సంబంధించి భారీ స్కామ్ లు ఉన్నాయ‌ని..వాటిని బ‌హిర్గ‌తం చేస్తే ప్ర‌భుత్వం కూలుతుంద‌ని అంటూ అప్ప‌ట్లో బిల్డ‌ప్పులు ఇచ్చారు. తీరా చూస్తే అంతా తుస్ మ‌న్పించారు. ఇప్పుడు మ‌రి నారా లోకేష్ కూడా కుటుంబ‌రావులాగే చేస్తారా లేక ఆధారాల‌తో వివ‌రాలు బ‌హిర్గతం చేసి మాట నిల‌బెట్టుకుంటారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News