జగన్ ను దాటాలని నారా లోకేష్ టార్గెట్ !

Update: 2022-11-13 08:30 GMT

Full Viewఎట్టకేలకు టీపీడీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం ఖరారు అయింది. జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర సాగే రోజులు..టార్గెట్ గా పెట్టుకున్న కిలోమీటర్లు చూస్తే నారా లోకేష్ ఈ విషయం లో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని రికార్డును దాటేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. రోజులు..కిలోమీటర్లది ఏముంది కొద్దిగా ఎక్కువ కష్టపడితే దీన్ని సాధించవచ్చు. కానీ పాదయాత్ర తర్వాత వచ్చే రాజకీయ ఫలితం అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంలో విఫలమైన జగన్ రెండవసారి పాదయాత్రతో రికార్డు విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా జగన్ రికార్డు ను బ్రేక్ చేయవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ యాత్ర తర్వాత టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుంది అన్నది ఇప్పడు లోకేష్ కు పెద్ద సవాలుగా మారనుంది. ఎవరు కూడా కేవలం నడిచిన రోజులు...తిరిగిన కిలోమీటర్లు చూసి వదిలేయరు. దీని ద్వారా వచ్చిన ఫలితమే లెక్క. 2019 కు ముందు జగన్ ఎప్పుడు నేరుగా అధికారంలో లేకపోవటం కూడా ఆయనకు కలిసివచ్చింది. అదే సమయంలో దివంగత రాజశేఖరరెడ్డి ఇమేజ్ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కానీ నారా లోకేష్ పరిస్థితి ఆలా కాదు. ఎందుకు అంటే టీడీపీకి..ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన చరిత్ర ఉంది.

                                            విభజన తర్వాత తొలి ఛాన్స్ కూడా టీడీపీకే దక్కిన విషయం తెలిసిందే. ఎంత లేదన్నా నారా లోకేష్ ఒక సారి అధికారం లో ఉండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇది అంత తేలికైన విషయం ఏమి కాదు. అదే సమయంలో పాదయాత్ర తర్వాత జగన్ సాధించిన సీట్లు..ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ఎంత విజయవంతం అవుతుంది..ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా కచ్చితంగా లెక్కలోకి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీడీపీ కి ఏమి వచ్చినా కూడా అది జగన్ పై వ్యతిరేకత తో రావటం తప్ప..టీడీపీ పై సానుకూలతతో కాదు అని ఒక టీపీడీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా పాదయాత్రతో నారా లోకేష్ ప్రజల్లో ఎలాంటి ముద్ర వేస్తారు అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. టీడీపీలోనే నారా లోకేష్ నాయకత్వానికి నేతల మద్దతు లేదు అన్న ప్రచారం ఉంది. పాదయాత్ర తో అటు ప్రజల్లోనూ..ఇటు పార్టీలోనే ఏ మేరకు లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతారు అన్నదానిపైనే అందరి ద్రుష్టి ఉంది. సీఎం జగన్ గతంలో 341 రోజులు.. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో దివంగత రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర లు చేసి ఎన్నికల్లో విజయాలు సాధించారు. దీంతో నారా లోకేష్ పై ఈ మేరకు ఒత్తిడి ఉండటం సహజమే.

Tags:    

Similar News