ఎక్కడో దీపం వెలిగిస్తారు. అది ఎక్కడో అంటుకుంటుంది. మామూలుగా దీపం వెలుగు ఇవ్వాలి. కానీ ఇక్కడ దీపం అంతా చీకటి పనులే. అది కూడా పట్టపగలే..యధేచ్చేగా..నిర్లజ్జగా. అందరూ చూస్తూ ఉండిపోతారు. వేల కోట్ల రూపాయల మేర దోపిడీ చేసిన వారికి అంతర్లీనంగా సహకరించేవారు ఎందరో. కొంత మంది పైకి కన్పించకుండా..మరికొంత మంది బహిరంగంగా. గత కొంత కాలంగా జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ వ్యవహారాలు చూస్తున్న సభ్యులు కూడా అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు చూసి అవాక్కు అవుతున్నారు. సహజంగా రాజకీయాలు...వ్యాపారాల్లో వెన్నుపోట్లు ఉంటాయి. మోసాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా అంతా ఓపెన్ గా..బహిరంగంగానే చేసేస్తున్నారు. జూబ్లిహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ప్రస్తుత కార్యదర్శి మురళీ ముకుంద్ తాజాగా తీసుకున్న నిర్ణయం కమిటీని షాక్ కు గురిచేసింది. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 44లో ని 853 ఎఫ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో నమోదు కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా కార్యదర్శి హోదాలో మురళీ ముకుంద్ పిటీషన్ దాఖలు చేశారని ప్రెసిడెంట్ సభ్యులకు తెలిపారు. గత కమిటీ ప్రెసిడెంట్, ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, మాజీ కార్యదర్శి హనుమంతరావులు అసలు అమెరికాలో ఉంటున్న శిరీష ప్లేస్ లో మరో మహిళను తీసుకొచ్చి ఇది రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ గతంలో కేసు నమోదు చేశారు. ఈ అంశం కోర్టులో ఉంది.
మేనేజింగ్ కమిటీకి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా కార్యదర్శి కేసు ఉపసంహరణ పిటీషన్ వేశారని జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ సభ్యులు అందరికీ లేఖ ద్వారా విషయాన్ని తెలిపారు. మురళీ ముకుంద్ చేస్తున్న అక్రమ, అనైతిక చర్యలకు సంబంధించి తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో మురళీ ముకుంద్ ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్ధం అవుతుందని కమిటీ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. మురళీ ముకుంద్ కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించి జూబ్లిహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవహారాల పరిశీలనకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని కోరారు. అదే సమయంలో ప్రెసిడెంట్ తోపాటు ఇతర మేనేజింగ్ కమిటీ తన నుంచి తొలగించిన అధికారాలు పూర్తిగా దక్కేలా ఇవ్వాలని మరో పిటీషన్ దాఖలు చేశారు. ఇలా పరస్పర విరుద్ధమైన పిటీషన్లు దాఖలు చేసి చర్చనీయాంశంగా మారారు. ఇప్పుడు కేసు ఉపసంహరణ తాజా నిర్ణయంతో ఆయన ఏజెండా ఏంటో తేలిపోయిందని చెబుతున్నారు.