అమరావతి భూములు. ఇన్ సైడర్ ట్రేడింగ్. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి పదే పదే విన్పిస్తున్న మాటలు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది వాస్తవానికి స్టాక్ మార్కెట్ కు సంబంధించిన వ్యవహరం. ఓ కంపెనీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ముందే తెలుస్తాయి కాబట్టి ప్రమోటర్లు, వారి బంధువులు..ఇతర సన్నిహితులు షేర్లు కొనుగోలు చేసి..నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత షేర్లు అమ్మేసుకుని లబ్ది పొందటాన్నే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇది నిరూపితం అయితే ప్రమోటర్లకు భారీ జరిమానా విధిస్తారు. కొన్ని సార్లు మరింత కఠిన శిక్షలు కూడా ఉంటాయి. కానీ దేశంలో ఎక్కడా కూడా ఓ ప్రభుత్వ సమాచారాన్ని ముందే తెలుసుకుని భూములు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేసి లబ్దిపొందితే ఈ చట్టం కింద శిక్ష పడే అవకాశాలు లేవని ముందు నుంచి అనుకుంటున్నదే. ఏపీ హైకోర్టులో ఇదే అంశంపై వాదోపవాదాలు జరిగిన తర్వాత చివరకు కోర్టు ఈ కేసును కొట్టేసింది. దీనిపై సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన దుష్యంత్ దవేను సుప్రీంకోర్టు అంతకు ముందు విచారణ చేపట్టిన రోజే ఐపీసీలోని ఏ సెక్షన్ కింద దీనిపై చర్యలు తీసుకోవాలి..ఏ శిక్షలు వేయవచ్చో చెప్పాలంటూ ప్రశ్నించింది. దీనికి ఆయన మరింత సమయం కోరారు. సోమవారం నాడు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
కోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి ప్రభుత్వ అప్పీల్ ను కొట్టేసింది. అంత మాత్రాన అమరావతి భూముల్లో అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు...అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరూ భూమి కొనలేదు అని కాదు. కానీ ఈ ఆరోపణలు చట్టం ముందు నిలబడవు. ప్రభుత్వ లావాదేవీలకు..పూర్తిగా స్టాక్ మార్కెట్ కే పరిమితం అయిన ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశానికి లింక్ పెట్టడం వల్ల ఈ అంశం న్యాయస్థానాల్లో నిలబడదు అని అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తన ప్రయత్నం తాను చేసింది కానీ..ఎదురుదెబ్బ తప్పలేదు. సో రికార్డుల పరంగా ఎన్ని ఆధారాలు ఉన్నా ఇలాంటి కేసుల్లో నిందితులు చట్టానికి చిక్కటం అంత సులభం కాదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. స్వయంగా సుప్రీంకోర్టులోనే ఈ కేసుకు చుక్కెదురు కావటంతో అమరావతి భూములకు సంబంధించిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం పూర్తిగా పడకేసినట్లే. ఇక ఏపీ ప్రభుత్వం ఈ అంశంలో చేయగలింది ఏమైనా ఉంది అంటే కొనుగోలు చేసిన భూములు...వాటి ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఐటి లెక్కలు ఏమైనా దొరుకుతాయా అని చూసుకోవటం మాత్రమే. అంతకు మించి అమరావతి భూముల వ్యవహారంలో ఇక కథ కంచికి చేరినట్లే కన్పిస్తోంది.
అయితే సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయటంతో రాజకీయంగా కూడా అధికార వైసీపీకి ఇబ్బందిగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. అమరావతిలో అక్రమాలు నిరూపించలేకపోవటం, మూడు రాజధానులు తెరపైకి తెచ్చి ఎక్కడా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవటం వంటి అంశాలు సమస్యగా మారే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రభుత్వం, రైతుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఏపీలోని జగన్ సర్కారు పూర్తిగా పక్కన పెట్టడంతో కోర్టులు మూడు రాజధానుల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది కూడా ఇప్పుడు కీలకం కానుంది. ఇప్పటికే అమరావతిలో దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉండటం...రైతులు రాజధాని కోసం భూములు ఇవ్వటం వంటి అంశాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఇదిలా ఉంటే అమరావతి భూముల కొనుగోలు కేసులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ గతంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సోమవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.