రాజకీయం అనే ఓ పరిశ్రమలో ఆయన ఓ సీఈవో. పధ్నాలుగు సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రి. ఓ దశాబ్దానికి పైగా ప్రతిపక్ష నాయకుడు. దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరు. ఫార్టీ ఇయర్స్ కుపైగా...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అలాంటి చంద్రబాబు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ని గెలిపించలేకపోయారు. అధికార వైసీపీ దొంగ ఓట్లు వేయించింది..అక్రమాలు చేసింది..అదికార దుర్వినియోగానికి పాల్పడింది వంటి విమర్శలు టీడీపీని, చంద్రబాబును గుడ్డిగా అభిమానించేవారి ఆత్మతృప్తికి పనికొస్తాయి. ఇంతటి చరిత్ర గల చంద్రబాబులాంటి నేత సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ ఎన్ని అక్రమాలు..అధికార దుర్వినియోగం చేసినా కూడా గెలిచి తీరాలి. అది నాయకుడి పట్టు అంటే. అప్పుడే మాత్రమే కుప్పం అయినా..మరొకటి అయినా చంద్రబాబు కంచుకోట అని చెప్పుకోవటానికి పనికొస్తుంది. అదే తెలంగాణ విషయానికి వస్తే హూజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ చేయని ప్రయత్నాలు లేవు. అనధికార లెక్కల ప్రకారం వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు.
అధికారికంగా దళిత బంధుతోపాటు ఇంకా ఎన్నో స్కీమ్ లు హుజూరాబాద్ లో ప్రత్యేకంగా అమలు అయ్యాయి. అధికార దుర్వినియోగం..పోలీసుల సాయం వంటి ఆరోపణలు లెక్కలేనన్ని. అయినా సరే...గిరిగీసి..బరిలో నిలబడి అన్నీ తట్టుకుని కూడా ఈటెల రాజేందర్ మళ్లీ గెలిచి సత్తా చాటారు. ఈటెల రాజేందర్ మాజీ మంత్రి మాత్రమే. కానీ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు నెరపటం..కొంత సానుభూతి..కెసీఆర్ పై వ్యతిరేకత వంటి అంశాలు ఆయన గెలుపునకు కలిసొచ్చాయి. అయినా సరే అధికార పార్టీ అష్టదిగ్భంధనం చేసి ఈటెల రాజేందర్ గెలుపును అడ్డుకోవాలని చూసినా అన్నింటిని చేదించుకుని ఈటెల రాజేందర్ విజయవిహారం చేశారు.. కానీ అదే చంద్రబాబు, టీడీపీ విషయానికి వస్తే మాత్రం ఏవో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ అయినా..మరొకరు అయినా ప్రత్యర్ధి ఎన్ని అడ్డంకులు కల్పించినా దాటుకుని బయటకు వచ్చిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. కానీ చంద్రబాబు విషయంలో మరి జరిగింది ఏంటి?. ఏపీలో జగన్ పాలన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రహదారుల దగ్గర నుంచి పలు అంశాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మరి చంద్రబాబు వీటిని ఏమి వాడుకున్నట్లు?.