కెటీఆర్ ట్వీట్ లో లాజిక్ మిస్
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మంత్రి కెటీఆర్ ల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. రేవంత రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ పై స్పందించిన మంత్రి కెటీఆర్ తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో పరీక్షలకు రెడీ అని..మరి దీనికి రాహుల్ గాంధీ వస్తారా? అని ప్రశ్నించారు. అంతే కాదు..తనది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదని రేవంత్ కు చురకలు అంటించారు. అయితే టెస్ట్ లకు రాహుల్ గాంధీ రావాలంటూ సవాల్ విసిరిన కెటీఆర్ ...పరీక్షల్లో తనకు క్లీన్ చిట్ వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి...పదవులు వదులుకుంటారా? అని ప్రశ్నించటంలో లాజిక్ మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓ వైపు రేవంత్ రెడ్డి తనతో టెస్ట్ లకు అర్హుడు కాదని..తనది ఆయన స్థాయి కాదంటూనే క్షమాపణ, రాజీనామాలు రేవంత్ వి అడగటంతో కెటీఆర్ లెక్కతప్పినట్లు అయిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ఇదంతా చూస్తుంటే రేవంత్ ట్రాప్ లో కెటీఆర్ చిక్కుకున్నట్లే కన్పిస్తోందని పార్టీ నేతలు కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. తనతో టెస్ట్ లకు అర్హత లేని రేవంత్ రాజీనామాలు కోరటంతో కెటీఆర్ చిక్కుల్లో పడినట్లు అయిందని..ఆయన్ను రేవంత్ రాజకీయంగా చికాకు పెడుతున్నట్లు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కెటీఆర్ తన ట్వీట్ లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇందుకు రేవంత్ సై అంటూ అవినీతి కేసుల విషయంలోసీఎం కెసీఆర్ కూడా లై డిటెక్టర్ టెస్ట్ లకు రావాలంటూ ప్రతి ఛాలెంజ్ విసిరారు. మరో వైపు చట్టపరంగా తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు కెటీఆర్ మరో ట్వీట్ చేశారు.