'కెసీఆర్ ముంద‌స్తు ఫార్ములా' మ‌ళ్ళీ విజ‌యం తెచ్చి పెడుతుందా?.

Update: 2022-03-21 09:00 GMT

Full Viewతెలంగాణలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా విన్పిస్తున్న మాట 'ముంద‌స్తు ఎన్నిక‌లు'. తొలిట‌ర్మ్ లో ఆరు నెల‌లు ముందుగా అసెంబ్లీని ర‌ద్దు చేసి టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ విజ‌యం సాధించారు. మ‌ళ్ళీ ఇప్పుడు అదే త‌ర‌హా ఫార్ములా వ‌ర్కవుట్ అవుతుందా?. అస‌లు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్ళాలి?. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళాల్సిన అవ‌స‌రం..ప‌రిస్థితులు ఏమి ఉన్నాయి?.. కేవలం ఇతర పార్టీలు గేర్ అప్ కాక‌ముందే తాము అనుకున్న విధంగా ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రోసారి విజ‌య‌తీరాల‌కు చేరాల‌నేది కెసీఆర్ ప్లాన్. అయితే తొలి ట‌ర్మ్ లో కెసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అప్ప‌టి మోడీ స‌ర్కారు స‌హ‌క‌రించింది. మ‌ళ్ళీ అలాగే ఇప్పుడు స‌హ‌క‌రిస్తుందా అంటే ఆ ప‌రిస్థితులు లేవ‌నే చెప్పొచ్చు. ఎందుకంటే గ‌త కొంత కాలంగా కెసీఆర్ మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేశారు. కేంద్రం స‌హ‌కారం లేకుండా కెసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌టం అంత ఈజీ కాదు. రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం జూన్ నాటికి అసెంబ్లీని ర‌ద్దు చేసి 2022 డిసెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ ఎన్నిక‌ల‌తో తెలంగాణ ఎన్నిక‌లు కూడా జ‌రిగేలా చూసుకోవ‌టం అనేది ఓ ప్లాన్ గా టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. లేదంటే 2023లో మేలో జ‌రిగే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తోపాటే తెలంగాణ‌కు కూడా ఎన్నిక‌లు వ‌చ్చేలా చూసుకోవ‌టం.

అయితే ఈ సారి కెసీఆర్ ముంద‌స్తు ప్లాన్స్ అంత సాఫీగా సాగే ఛాన్స్ లు క‌న్పించటం లేదు. జూన్ లో అసెంబ్లీని ర‌ద్దు చేస్తే అప్ప‌టి నుంచి ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల స‌మ‌యం ఉంటుంది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఈసీ ఏ నిర్ణ‌యం తీసుకోకుండా నాన్చితే...ఆరు నెల‌ల గడువు ముగిసే నెల ముందు కేంద్రం రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు సిఫార‌సు చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఓ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది. ఎందుకంటే ప్ర‌స్తుతం మోడీ, కెసీఆర్ ల మ‌ధ్య సంబంధాలు అంత స‌వ్యంగా లేవ‌నే విష‌యం తెలిసిందే. అప్పుడు టీఆర్ఎస్ మ‌రింత చిక్కుల్లో ప‌డ‌టం ఖాయం. అనుకున్న ముంద‌స్తు ఎన్నిక‌ల ప‌ని పూర్తికాక‌పోగా..ప్ర‌జ‌ల్లో తీవ్ర అస‌హ‌నం వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌నే అభిప్రాయం కూడా ఉంది. ముంద‌స్తు వ్యూహంలో భాగంగానే కెసీఆర్ వ్యూహాత్మ‌కంగా 80 వేల‌కు పైగా ఉద్యోగాల భ‌ర్తీతోపాటు ఈ బ‌డ్జెట్ లో ద‌ళిత‌బంధుకు అధిక నిధులు కేటాయింపులు చేయించారు. షెడ్యూల్ ప్ర‌కారం అయితే వ‌చ్చే ఏడాది చివ‌రి వ‌ర‌కూ స‌ర్కారుకు గ‌డువు ఉంది. అయితే తెలంగాణ రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో అన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లో ఉంది.

Tags:    

Similar News