ఫిబ్రవరి 22న ఏపీ కేబినెట్ ఆమోదం
మార్చి 31న లిబర్టీ స్టీల్ ప్రతిపాదన పక్కన పెట్టామన్న సర్కారు
అంత గుడ్డిగా పరిశ్రమల శాఖ వ్యవహరించిందా?
నెలా వారం రోజుల్లోనే కథ తిరగబడిందా?. ఈ లోపే ఫిబ్రవరి 22 వరకూ అద్భుతంగా కన్పించిన కంపెనీ దివాళా తీసిందా?. అంటే అంత వేగంగా ఓ కంపెనీ పతనం సాధ్యం అవుతుందా?. అసలు ఓ కీలక పరిశ్రమలోకి భాగస్వామిగా ఎంపిక చేసుకునే సంస్థ ఆర్ధిక పరిపుష్టత, శక్తి సామర్ధ్యాలను ఏపీ పరిశ్రమల శాఖ పరిశీలించిందా?. పరిశీలిస్తే నెల రోజుల్లోనే దివాళా తీసే కంపెనీకి ఎలా ఓకే చెప్పింది. లేదా గుడ్డిగా ఎవరు వస్తే వాళ్ళే పరిశీలన మాకెందుకు అని ఊరుకుందా?. ఇవన్నీ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలే. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ ను పరుగులు పెట్టిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం పెట్టాల్సిన ఈ ప్రాజెక్టు విషయంలో అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ చేతులెత్తేసి మేమే పెట్టుకుంటాం అని ముందుకొచ్చారు.
పోనీ అది కూడా ఏమైనా అంతా పక్కాగా చేస్తున్నారా అంటే అదీ లేదు. జగన్ సర్కారుకు తొలి నిర్ణయమే షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష్యతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో లిబర్టీ స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యానికి ఓకే చేశారు. మొత్తం 10082 కోట్ల రూపాయలతో కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాబోతుందని ప్రకటించారు. పలు దశల్లో ఈ పెట్టుబడి ఉంటుందన్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మార్చి 31న నాటికే సీన్ రివర్స్ అయింది. అసలు లిబర్టీ స్టీల్ ఆర్ధికంగా ఏ మాత్రం సరిగాలేదని..ఆ కంపెనీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిస్థితిలో లేదని ఏపీ పరిశ్రమలు, ఐటి శాఖ ల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. లిబర్టీ స్టీల్స్ తో కలపి కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెడుతున్నామని..ఎల్ 2గా వచ్చిన కంపెనీతో ముందుకు వెళ్ళాలా? లేక ప్రభుత్వమే సొంతంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలా అనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు.
అసలు ఏపీ సర్కారు ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగే పనేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అధికార వర్గాలు కూడా ఇది ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదని..ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నడపటం జరిగే పనికాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయితే ఏపీ సర్కారు లిబర్టీ స్టీల్ కు సంబంధించిన ఆర్ధిక స్థితిగతులు, సామర్ధ్యం వంటి అంశాలను పరిశీలించకుండా కేబినెట్ లో పెట్టి ఎలా ఆమోదించిందని ఓ అధికారి సందేహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా కంపెనీ విషయంలో తగిన శ్రద్ధ పెట్టి ఉండాల్సిందని అన్నారు.