ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నేతలు కొంత మంది బిఆర్ఎస్ పార్టీ లో చేరిన సందర్భంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు చూసిన తర్వాత కొంత మంది అధికారులు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎందుకంటే ఈ మీటింగ్ లో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు చూసి అధికారులు విస్మయానికి గురి అవుతున్నారు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి . అందులో ప్రధానమైనవి ఇవి. కేంద్రంలోని మోడీ సర్కారు ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రవేట్ పరం చేసినా బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకుంటది. ఎల్ఐ సి ని ప్రవేట్ పరం చేసినా మళ్ళీ జాతీయం చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. అసలు ఇది జరిగే పనేనా?. ఇది సాధ్యం అవుతుందా?. ఇదే కెసిఆర్ ప్రతిపక్షం లో ఉండగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అచ్చం ఇలాంటి హామీలే ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వెనక్కి తీసుకుంటామని..తామే నడుపుతామని చాలా ప్రకటనలు చేసారు. కానీ అమలు విషయానికి వచ్చే దగ్గర చేతులు ఎత్తేసారు.
నిజాం షుగర్స్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో ముడి పడిన అంశం. అయినా సరే కెసిఆర్ సర్కారు ఇదే చేయలేదు. ఇక ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తామని చెపితే ఎవరైనా నమ్ముతారా?. నిన్న కెసిఆర్ చెప్పిన లెక్కల ప్రకారం రేపు ఎప్పుడైనా తెలంగాణ లో ప్రభుత్వం మారితే కెసిఆర్ సర్కారు అమ్మిన కోకాపేట భూములు కూడా వెనక్కి తీసుకోవచ్చా?. ...ఒక వైపు మోడీ సర్కారుపై విమర్శలు చేస్తూ తెలంగాణ లో ఎకరాలు కాదు గజాల లెక్కన కూడా ప్రభుత్వం భూములు అమ్ముతూ పబ్బం గడుపుకుంటోంది. ఇవన్నీ ఇలా పెట్టుకుని బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఇలా అలవోకగా చేసిన ప్రకటనలు చూసి అధికారులు షాక్ కు గురి అవుతున్నారు. అది కూడా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను పక్కన పెట్టుకుని మరీ అయన ఈ మాటలు చెప్పారు. ఇంత కాలం రాష్ట్ర ప్రజలే కెసిఆర్ మాటల గారడీ చూసారని..ఇప్పుడు దేశ ప్రజలకు కూడా ఇది అర్ధం అవుతుంది అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు.