జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ గత పాలకవర్గం తీరు ఇది
కమిటీలోని ఒక్కొక్కరికి రాడో వాచ్...ల్యాప్ టాప్
వాళ్లు అంతా జూబ్లిహిల్స్ లో ఉంటారు. అందరూ కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్లే. కొంత మందికి అయితే వందల కోట్లలో ఆస్తులు ఉన్నాయి. కానీ పదవి నుంచి వెళుతూ వెళుతూ కూడా ఒక్కొక్కరు లక్ష రూపాయల విలువ చేసే గిఫ్ట్ లు తీసుకుని వెళ్లారు. ఒక్కరు తప్ప..పధ్నాలుగు మంది ఆ జాబితాలో ఉన్నారు. ఇది అంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా?. అక్రమాలకు అడ్డాగా మారిన జూబ్లిహిల్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ లోని గత పాలకమండలి వ్యవహరం ఇది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో పాత కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి..కొత్త పాలకమండలి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ఏమిటంటే గత పాలక మండలి ప్రెసిడెంట్, ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి, కార్యదర్శి టి. హనుమంతరావుతోపాటు మిగిలిన 12 మంది సభ్యులు తమ పదవి కాలం పూర్తి అయిన తర్వాత ఒక్కొక్కరు లక్ష రూపాయల వ్యయంతో మొత్తం 15 లక్షల రూపాయలు వెచ్చి రాడో వాచీలతోపాటు ల్యాప్ టాప్ లు కొనుగోలు చేసిగిఫ్ట్ లు తీసుకున్నారని సొసైటీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సొసైటీ రికార్డుల్లో స్పష్టంగా ఉంది.
గత కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న దేవేందర్ రెడ్డి మాత్రం ఈ గిఫ్ట్ లను సొసైటీకి తిరిగి వెనక్కి పంపించారు. అంటే మిగిలిన వారు అందరూ గిఫ్ట్ లు తీసుకున్నవారే. ఏజీఎం అనుమతి లేకుండా ఇలా సొసైటీ నిధులు ఖర్చు పెట్టకూడదని..కానీ దిగిపోయే కమిటీ చేసిన అక్రమాలు చాలదు అన్నట్లు ఇలా ఒక్కొక్కరికి లక్ష రూపాయల గిఫ్ట్ లు ఇవ్వటం సరికాదని సొసైటీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలు పాలక మండలిని ఏలిన నేతలు అందులోనూ కోట్లాది రూపాయలు ఆస్తులు ఉండి కూడా ఇలా లక్ష రూపాయల గిఫ్ట్ లకు కక్కుర్తి పడటం ఏమిటని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఫోర్జరీ డాక్యుమెంట్లతో లేని వ్యక్తిని తీసుకొచ్చి కోట్లాది రూపాయలు విలువైన స్థలం రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారం కేసులు..కోర్టుల దాకా వెళ్లిన విషయం తెలిసిందే.