మద్దతే కాదు..మద్దతు సంతకాలు కూడా...ఎన్డీయే భాగస్వామిలా వ్యవహరించిన వైసీపీ
ఇది రాజకీయంగా పార్టీకి లాభమా..నష్టమా?
రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా జగన్ ఎందుకిలా?
నోరెత్తలేని స్థితిలో టీడీపీ..జనసేన
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా అడుగు ఆయనకు రాజకీయంగా లాభం చేస్తుందా..లేక నష్టం చేస్తుందా?. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోడీ సారధ్యంలోని ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వటమే కాదు..ఏకంగా ఎన్డీయే భాగస్వామిగా పక్షం తరహాలో నామినేషన్ సెట్లపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రతిపాదిత సంతకాలు కూడా చేశారు. వాస్తవానికి సీఎం జగనే దీనికి హాజరు అవ్వాల్సి ఉంది..కానీ కేబినెట్ కారణంగా ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ సంగతి పక్కక పెడితే గతంలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి రామ్ నాథ్ కోవింద్ కు అప్పట్లో వైసీపీ మద్దతు ఇవ్వటం వేరు..ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది. అంతే కాదు..తాను సీఎం అయితే చాలు..కేంద్రం నుంచి విభజనకు సంబంధించి చట్టబద్దంగా రావాల్సిన హామీలతోపాటు..ప్రత్యేక హోదా సాధిస్తానంటూ జగన్ ఊదరగొట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ మూడేళ్లలో ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల విషయంలో జగన్ పెద్దగా చేసింది ఏమీలేదనే చెప్పొచ్చు. చివరకు సొంత జిల్లాకు చెందిన కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రంలోని మోడీ సర్కారును ఒప్పించలేకపోయారు.మరి రాష్ట్రానికి సంబంధించి చట్టబద్ధంగా చేయాల్సిన పనులు ఏమీ చేయకపోయినా జగన్ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎందుకు ఇంతగా సాగిలపడ్డారు అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రపతి ఎన్నిక అభ్యర్ధి గెలుపునకు వైసీపీ ఓట్లు అత్యంత కీలకంగా మారిన తరుణంలో జగన్ భేషరతు మద్దతు నిర్ణయం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. మరి జగన్ సీఎం అయిన మూడేళ్ల తర్వాత కూడా కేంద్రం నుంచి ప్రత్యేకంగా తెచ్చింది ఏమీలేదు. అంతే కాదు...చట్టబద్దంగా తెచ్చుకోవాల్సిన వాటి విషయంలో కూడా హ్యాండ్సప్ అనేశారు. విచిత్రం ఏమిటంటే జగన్ కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇంతలా సరెండర్ అయిపోయినా కూడా ఈ విషయంలో నోరెత్తలేని స్థితిలో టీడీపీ, జనసేన పార్టీలు ఉండటం హైలెట్ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అధికారికంగా బిజెపి-వైసీపీల మధ్య ఒప్పందం ఏమీలేకపోయినా అనధికారికంగా అటు కేంద్రంలోని లోని పెద్దలకు..జగన్ కు మధ్య సఖ్యత బాగుందని..ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు బహిరంగంగా అటు బిజెపి జాతీయ ప్రెసిడెంట్ నడ్డా..ఇటు ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడా వైసీపీ మాకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు లేదు. అంతా లోలోపల జరిగిపోయాయి. కానీ అధికార వైసీపీ నుంచి ఆకస్మాత్తుగా రాత్రి పూట ఓ ప్రకటన వెలువడింది..మా మద్దతు బిజెపి అభ్యర్ధికే అని. పోనీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఏమైనా పార్టీ కార్యవర్గం..లేదా ఇతర అత్యున్నత నిర్ణాయక కమిటీ సమావేశం ఏమైనా జరిగిందా అంటే అదీ లేదని వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మద్దతు ఇవ్వటం వరకూ కొంతలో కొంత ఒకే కానీ..ఏకంగా ప్రతిపాదన సెట్లపై సంతకం చేయటం రాజకీయంగా ఒకింత నష్టం అని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.