అత్యంత ఉత్కంఠ రేపిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విషయంలో దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐ తనదైన శైలిలో కౌంటర్ దాఖలు చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అందులో తన వైఖరి ఏంటో చెప్పకుండానే కేసు మెరిట్స్ ఆధారంగా కోర్టే నిర్ణయం తీసుకోవాలని కోరింది. వాస్తవానికి కోర్టు నిర్ణయం తీసుకోవటానికి సీబీఐ అభిప్రాయం..సమాచారం కూడా అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. అలాందిది హై ఫ్రొఫెల్ కేసు అయిన సీఎం జగన్ బెయిల్ రద్దు విషయంలో మాత్రం సీబీఐ సేఫ్ గేమ్ ఆడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే కోర్టు నిర్ణయానికే నిర్ణయాన్ని వదిలేసింది. వాస్తవానికి సీబీఐ తన దగ్గర జగన్ ఎవరినీ ప్రభావితం చేస్తున్నట్లు ఆధారాలు లేకపోతే ఆ విషయమే కోర్టుకు చెప్పొచ్చు. లేదు సమాచారం ఉంటే అదైనా చెప్పొచ్చు. కానీ అలా ఇలా కాకుండా..పూర్తిగా గోడమీద పిల్లి తరహాలో వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి సీఎం జగన్ పై ఇప్పటికే పదకొండు కేసులకు సంబంధించి ఛార్జి షీట్లు దాఖలు అయ్యాయి. విచారణ కూడా పూర్తి అయింది. అయితే ఇప్పుడు కొత్తగా సీఎం జగన్ ఎవరినైనా ప్రభావితం చేసే అవకాశాలు కూడా చాలా తక్కువే ఉంటాయని..విచారణ జరిగాక కోర్టులు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ న్యాయనిపుణుడు వ్యాఖ్యానించారు. సీబీఐ అంటేనే ఎవరు అధికారంలో ఉంటే వారి చెప్పుచేతల్లో ఉంటుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
ప్రస్తుతం సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులు నమోదు అయిన సమయంలో కాంగ్రెస్ నాయకుల ప్రోద్భలంతోనే ఈ కేసులు నమోదు చేశారని..ఇవి అన్నీ రాజకీయ ప్రేరేపితం అయిననే అని ఆరోపించారు. జగన్ తో సహా వైసీపీ నేతలు కూడా సీబీఐపై గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన వారే. దీంతో ఇప్పుడు సీబీఐ కూడా తన దగ్గర ఏ ఆధారాలు ఉంటే వాటి ఆధారంగా కోర్టు ముందు పిటీషన్ దాఖలు చేయాల్సి ఉండగా..అలా కాకుండా మొత్తం వ్యవహారాన్ని కోర్టుకు వదిలేయంతో సీబీఐ సేఫ్ గేమ్ ఆడటంతో పాటు..కేంద్ర పెద్దల ఆదేశాల మేరకే ఇలా చేసి ఉండొచ్చని చెబుతున్నారు. కోర్టులో ఓ పిటీషన్ దాఖలు అయితే దానికి విచారణ సంస్థ ఔననే..కాదనో ఏదో ఒక సమాధానం అయితే చెప్పాలి..కానీ ఇక్కడ సీబీఐ మాత్రం నాకేమీ తెలియదు..మీరే చూసుకోండి అని భారం మొత్తం కోర్టు మీదకు నెట్టేసింది. ఇదే ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది.