రెండేళ్లలో మూడు అత్యుత్తమ ఇసుక విధానాలా?

Update: 2021-03-24 04:10 GMT

ఇసుక తుఫాన్ లో జగన్ సర్కారు

గతంలోనూ ఇదే తరహాలో అత్యత్తుమం అంటూ ప్రకటనలు

ప్రైవేట్ సంస్థకు ఇచ్చి సమర్ధనకు తంటాలు

ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏ అంశంపై అయితే అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేసిందో...ఇప్పుడు జగన్ సర్కారు కూడా అదే ఇసుక విషయంలో తీవ్ర విమర్శల పాలు అవుతోంది. ఎవరైనా రెండేళ్ళలో 'మూడు అత్యుత్తమ ఇసుక విధానాలు' ప్రవేశపెట్టగలరా?. అంటే ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మాత్రమే దక్కుతుందని చెప్పొచ్చు. అంతే కాదు ఈ విషయంలో రికార్డెడ్ గా కూడా దొరికిపోయారు. ఏదో ఒకటి అత్యుత్తమ విధానం ఉంటుంది కానీ..తాము ఏది చేస్తే అదే అత్యుత్తమం అని ప్రజలను నమ్మాలంటోంది ఏపీ సర్కారు. తాజాగా ప్రైవేట్ సంస్థకు ఇసుక విధానం అప్పగింతపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీని కోసం ఏకంగా పేజీలకు పేజీలు పలు పత్రికల్లో యాడ్స్ కూడా ఇచ్చారు.

విచిత్రం ఏమింటే 2019 నవంబర్ లో ఒకసారి కూడా ఇలాగే పత్రికల నిండా యాడ్స్ ఇచ్చారు. ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం..రాష్ట్రంలో అసెంబ్లీ నియెజకవర్గాల వారీగా అందరికీ అందుబాటులో ఇసుక అంటూ ప్రకటించారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఆన్ లైన్ విధానంలోనే ఇసుక అందుబాటులో ఉండటం వల్ల అందరికీ ఇసుక బుక్ చేసుకునే సౌకర్యం ఉండటం లేదని గుర్తించినట్లు తెలిపారు. అక్కడక్కడ స్తానిక నాయకుల జోక్యం కూడ పెరుగుతుందని ఏకంగా పత్రికా ప్రకటనలోనే పేర్కొన్నారు. అంతే కాదు..మంత్రివర్గ ఉపసంఘం సూచనలతోపాటు..ప్రజల నుంచి సలహాలు..సూచనలు స్వీకరిస్తామంటూ 2020 అక్టోబర్22 నుంచి 28 వరకూ సమయం కూడా ఇచ్చారు.

మరింత మెరుగైన పాలసీ తెస్తున్నామని అంటూ యాడ్ లో ప్రస్తావించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పాత విధానం కష్టంగా ఉంది..కాబట్టి మరింత మెరుగైన ఇసుక విధానం అంటూ ఏకంగా రాష్ట్రంలో మొత్తం ఇసుక సరఫరాను ఏకంగా ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారు. మరి మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులు ఏమయ్యాయి.. ప్రజల నుంచి స్వీకరించిన సలహాలు.సూచనలు ఏమయ్యాయి అన్నది ఇప్పుడు ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. అంతే కాదు..ఉత్తమ విధానం కోసం అంటూ ఏకంగా కొన్ని నెలల పాటు ఇసుక సరఫరాను కూడా నిలిపివేసిన చరిత్ర ఏపీ లోని జగన్మోహన్ రెడ్డి సర్కారుదే. ఇసుక సరఫరా విషయంలో రెండేళ్ళలో ఇన్ని పిల్లిమొగ్గలు వేసిన సర్కారు ఇదే.

Tags:    

Similar News