తెలంగాణ‌కు రాహుల్ టూరిస్ట్ అయితే...ఢిల్లీకి కెసీఆర్ ఏమ‌వుతారు?!

Update: 2022-05-07 05:59 GMT

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై మంత్రి కెటీఆర్ తోపాటు టీఆర్ఎస్ నేత‌లు అంద‌రూ పొలిటిక‌ల్ టూరిస్ట్ అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. స‌రే..కాసేపు వారు చెబుతున్న‌దే నిజం అనుకుందాం. మ‌రి టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ ను ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు దేశ నేత‌గా ప్రచారం చేసుకుంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ దగ్గ‌ర నుంచి ముంబ‌య్ తో స‌హా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి హోర్డింగ్ లు, యాడ్స్ ఇస్తూ దేశ్ కీ నేత‌గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కెసీఆర్ కూడా తాను ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల్లో ఉన్నానని..దేశానికి ఓ ప్ర‌త్యామ్నాయ విధానం తీసుకొస్తాన‌ని...స‌రైన దిశ‌లో నడిపిస్తాన‌ని చెబుతున్నారు. మ‌రి కాంగ్రెస్ నేత రాహుల్ తెలంగాణ‌కు పొలిటిక‌ల్ టూరిస్ట్ అయితే..కెసీఆర్ ఢిల్లీకి ఏమి అవుతారు?.. టీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రైనా దీనిపై స్పందిస్తారా?. కొద్ది రోజుల వ‌ర‌కూ ప్రాంతీయ పార్టీల కూట‌మి క‌ట్టేందుకు..ఫ్రంట్ కోసం నానా ప్ర‌య‌త్నాలు చేసిన కెసీఆర్ అది సాధ్యంకాద‌ని తెలిసిన త‌ర్వాత ప్ర‌త్యామ్నాయ విధానం అంటూ మాట మార్చిన విష‌యం తెలిసిందే.

త‌న అజెండా నలుగురు వ్య‌క్తుల గుంపో..పార్టీల కూట‌మో కాద‌ని తాజాగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల ముందు కూడా మీకెవ‌రికి తెలియ‌దు..మేం అల్రెడీ ప్ర‌త్యేక విమానాలు కూడా బుక్ చేసుకున్నాం..అస‌దుద్దీన్ ఓవైసీ తాను క‌ల‌సి మోడీకి వ్య‌తిరేకంగా దేశం అంతా తిరుగుతామ‌ని ప్ర‌కటించారు. త‌ర్వాత సీన్ క‌ట్ చేస్తే ఏమీలేదు. తెలంగాణా నుంచి కెసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ళి...అక్క‌డ మాత్రం దేశానికే మార్గ‌నిర్దేశం చేయ‌వ‌చ్చు. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌కు వ‌చ్చిపోతే పొలిటిక‌ల్ టూరిస్ట్ అవుతారా?. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఎన్నిక‌ల వ్యూహాల కోసం ప్ర‌శాంత్ కిషోర్ ను పెట్టుకుందో అప్పుడే ఆ పార్టీకి ప‌లు అంశాల‌పై మాట్లాడే హ‌క్కు పోయిన‌ట్లు అయింద‌నే విమర్శ‌లు ఉన్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ మాత్రం జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పి వీలు అయితే కెసీఆర్ ప్ర‌ధానిని చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. కానీ ఓ పార్టీ స‌మావేశం పెట్టుకుని ...త‌మ ఏజెండా ఏమిటో చెపితే మాత్రం రాజ‌కీయ టూరిస్ట్ అంట‌?.

Tags:    

Similar News