కార్పొరేట్ సర్కిల్స్ లో మాత్రమే ప్రచారంలో ఉన్న అంశాన్ని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రస్తావించటం తో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సిబిఐ, ఈడీ లతో కేసు లు పెట్టించి దేశంలో నెంబర్ వన్ విమానాశ్రయంగా ఉన్న ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ తన స్నేహితుడు అదానీ కి దక్కేలా చేశారని..అత్యంత లాభదాయకం అయిన ఈ ఎయిర్ పోర్ట్ ను హైజాక్ చేశారు అంటూ లోక్ సభ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఇది ఒక్కటే కాదు దేశం లో విమానాశ్రయాలు అదానీ కి అప్పగించేందుకు వీలుగా నిబంధనలు కూడా మార్చారని విమర్శించారు. ఇది ఒకెత్తు అయితే ఈ ఆరోపణలపై జీవీకె గ్రూప్ తో ఖండన ఇప్పించటానికి అదే అదానీ కి చెందిన ఛానల్ ఎన్డీటీవీ చాలా కష్టపడింది. నేరుగా రాహుల్ గాంధీ వ్యాఖలకు కౌంటర్ ఇప్పించే ప్రయత్నం జరగ్గా..అది అంతగా సఫలం కాలేదు. ఈ అంశంపై జీవీకే వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి ఒక్క ఎన్డీటీవీ తోనే మాట్లాడారు. అందులో కీలక అంశాలు ఇలా ఉన్నాయి. 'గౌతమ్ భాయ్ మమ్మల్ని సంప్రదించారు. మాకు ఎయిర్ పోర్ట్ వ్యాపారంలో చాలా ఆసక్తి ఉంది అని చెప్పారు. అప్పుల్లో ఉన్న కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ డీల్ చేశాం తప్ప మా పై అదానీ తో పాటు ఎవరి ఒత్తిడి లేదు. కరోనా సమయంలో కొన్ని నెలల పాటు పూర్తిగా కార్యకలాపాలు నిలిచిపోవటం ఒత్తిడి పెరిగింది.
పార్లమెంట్ లో జరిగిన వాటిపై మాట్లాడి తాను రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవటం లేదు. అదానీ భాయ్ నేరుగానే మాతో డీల్ చేశారు. ..మధ్యలో ఎవరూ లేరు. ముంబై ఎయిర్ పోర్ట్ ను అదానీ కి విక్రయించే వ్యవహారంలో తమ డీల్ అంతా సాఫీగా సాగిపోయింది' అని తెలిపారు. ఇది ఇలా ఉంటే 2020 జూన్ లో జీవీకే గ్రూప్ 705 కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడింది అని సిబిఐ కేసు నమోదు చేసింది. ప్రధానంగా ముంబై విమానాశ్రయం లో ఇది జరిగింది అని ఆరోపించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ ) అధికారులతో కుమ్మక్కు అయి ఈ పని చేశారని అభియోగాల్లో పేర్కొన్నారు. ఇందులో హై లైట్ ఏమిటి అంటే అదే సిబిఐ 2023 జనవరి 3 న ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. తమ విచారణలో ఈ విషయం తెలిసింది అన్నారు. ఇదే కేసు లో జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి తో పాటు అయన తనయుడు సంజయ్ రెడ్డి, ఇతర అధికారులపై కేసు నమోదు అయింది. ఇప్పుడు అధికారులు బయటకు వచ్చారు. ఇక మిగిలింది ప్రమోటర్లే. 2020 జూన్ లో కేసు నమోదు అయింది...2021 జులై లో జీవీకే నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ అదానీ పరం అయింది. ఇదీ లెక్క.