ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్రికలకు ఇచ్చే ప్రకటనలో విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మించిపోయారు. మాట్లాడితే జాకెట్ యాడ్స్ కుమ్మేస్తున్నారు. చివరకు ప్రైవేట్ కు అప్పగించిన ఇసుక దందాకు కూడా సర్కారు డబ్బులతోనే యాడ్స్ ఇస్తున్న చరిత్ర ఉంది. దీనికి ప్రధాన కారణం జగన్ కు సొంత పత్రిక ఉండటం అనే విమర్శలూ ఉన్నాయి. ఇది ఒకెత్తు అయితే జగన్ సీఎం అయినప్పటి పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చినా..జాకెట్ యాడ్స్ ఇచ్చినా అందులో ఒక్క జగన్ ఫోటో తప్ప..మరొకటి కన్పించటానికి వీల్లేదు. సంబంధిత శాఖ మంత్రి కి కూడా పొరపాటున అందులో చోటు ఉండదు. ఇదే అంశంపై గతంలో తెలుగుగేవ్ టే. కామ్ పలుమార్లు వార్తలు రాస్తే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అలా చేస్తున్నామంటూ కొంత మంది మొక్కుబడి వివరణలు ఇచ్చారు. నిజంగా అలాంటి మార్గదర్శకాలే ఉంటే తెలంగాణ సర్కారు ప్రభుత్వ యాడ్ లో మంత్రివర్గం మొత్తానికి ఎలా చోటు కల్పిస్తుంది. సరిగ్గా సోమవారం నాడే తెలంగాణ మంత్రివర్గం మొత్తానికి చోటు కల్పిస్తూ ఇక్కడి ప్రభుత్వం ప్రకటన ఇస్తే ..ఏపీలో కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ యాడ్ వచ్చింది. అందులో కేవలం ఆ శాఖ మంత్రి పేరు మాత్రమే రాశారు. ఇది అర పేజీ ప్రకటన మాత్రమే. అయితే జాకెట్ యాడ్స్..పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చిన సమయంలో కూడా జగన్ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు.
ప్రభుత్వం అంటే తాను తప్ప ఎవరూ కాదన్న రీతిలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే ఆయన కోట్లాది రూపాయల వ్యయం చేసే పత్రికా ప్రకటనల్లోనూ తన సొంత మంత్రులకు కూడా చోటు కల్పించటంలేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా..మంత్రులను డమ్మీలను చేశారని విమర్శించిన వైసీపీ నాయకత్వం.. అధికారంలోకి వచ్చాక అంతకు మంచి వ్యవహరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు హయాంలోనే మంత్రులకు కాస్త స్వేచ్చ ఉండేదటని మరో ఐఏఎస్ అదికారి అభిప్రాయపడ్డారు. ఆయా శాఖల మంత్రులకు సంబంధించిన నిర్ణయాలు కూడా సీఎం దగ్గర పలుమార్లు పెండింగ్ లో పడిపోతున్నాయని..ఆయన చూసి చెపితే తప్ప..అవి ఏమి అయ్యాయి అని అడిగే సాహసం మంత్రులు చేయటంలేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం ఉంది. సోమవారం నాడు తెలంగాణ సర్కారు మంత్రివర్గం మొత్తంతో యాడ్ ఇచ్చిన సమయంలో ఏపీ సర్కారు ఇచ్చిన యాడ్ తో ఈ రెండింటి మధ్య పోలికలు రావటం సహజమే. అయితే తెలంగాణ సర్కారు మంత్రివర్గం మొత్తానికి చోటు కల్పించింది ఇదే తొలిసారి. అయితే ఏపీ ప్రభుత్వంలా కాకుండా ఏదైనా ప్రకటనలు ఇచ్చిన మంత్రులకు మాత్రం తెలంగాణ సర్కారు చోటు కల్పిస్తోంది. ఏపీలో మాత్రం అదీ లేదు.