ప్రపంచానికి 'డిసెంబర్' అత్యంత కీలకం

Update: 2020-11-30 15:25 GMT

ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు రెడీ

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కూడా..!

డిసెంబర్. ప్రపంచానికి ఈ నెల అత్యంత కీలకం కానుంది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు అన్నీ ఈ నెలలో వెలువడనున్నాయి. దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ ఇప్పటికే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన నియంత్రణా సంస్థ అయిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ)కు దరఖాస్తు చేసుకుంది. ఎఫ్ డీఏ దీనిపై డిసెంబర్ 10 నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి లభిస్తే డిసెంబర్ 11 లేదా 12 నుంచే అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ వస్తుందనే ఆశలతో అంతా రెడీ చేసి పెట్టారు. కారణం ఏదైనా ట్రంప్ రెడీ చేసిన పెట్టిన వ్యవస్థ ఇప్పుడు వ్యాక్సినేషన్ కు ఉపయోగపడనుంది. ఎఫ్ డీఏ అనుమతి లభించిన కొద్ది నెలల్లోనే అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగనుంది.

దీని కోసం ఇఫ్పటికే విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు కూడా అన్ని రకాలు ఏర్పాట్లు చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికాకు చెందిన మరో సంస్థ మోడెర్నా కూడా కొత్త డేటాను విడుదల చేసింది. ఇది కూడా చాలా సానుకూల ఫలితాలను ప్రకటించింది. అంతే కాదు..తమ వ్యాక్సిన్ కూడా అత్యవసర ఉపయోగానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. తాజా డేటా ప్రకారం కూడా తమ వ్యాక్సిన్ 94 శాతం ప్రభావవంతంగా ఉందని, తీవ్రమైన అనారోగ్యం నుండి సురక్షితంగా కాపాడుతుందని వెల్లడించింది. తీవ్రమైన కరోనా వైరస్‌ను నివారించడంలో 100 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు కనిపిస్తోందని మోడెర్నా తెలిపింది.

తాజా ఫలితాల ఆధారంగా అమెరికా , యూరోపియన్‌ దేశాల్లో అత్యవసర వినియోగంకోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాదు రానున్న వారల్లో తమకు అనుమతి లభించనుందనే విశ్వాసాన్ని కంపెనీ అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ హోగ్ వ్యక్తం చేశారు. ఈ డేటాపై చర్చించడానికి డిసెంబర్ 17న ఎప్‌డీఏ సిద్ధంగా ఉంటుందని మోడెర్నా ఆశిస్తోంది. అమెరికాలో కంపెనీల వ్యవహారం ఇలా ఉంటే భారత్ లో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ కూడా డిసెంబర్ లోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటిచింది. దీంతో డిసెంబర్ నెల కరోనా నుంచి విముక్తికి సంబంధించి అత్యంత కీలకంగా మారింది.

Tags:    

Similar News