తెలంగాణలో అంతే..తెలంగాణ అంతే అన్నట్లు ఉంది వ్యవహారం. ముఖ్యమంత్రి కెసీఆర్ శనివారం నాడు అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖపై సమీక్ష నిర్వహించారు. సీఎం కెసీఆర్ ఆర్ధిక శాఖపై సమీక్ష నిర్వహించటం పెద్ద వింత ఏమీ కాకపోయినా ఈ సమీక్షకు సంబంధిత శాఖ మంత్రి అయిన హరీష్ రావును పిలవకపోవటమే విశేషం. ప్రభుత్వం అధికారికంగా విడుదలచేసిన నోట్ ప్రకారం ఈ సమావేశంలో హరీష్ రావు తప్ప అందరూ ఉన్నారు. గతంలో ఈటెల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఇదే సీన్ నడిచేది. ఆయనకు సంబంధం లేకుండానే బడ్జెట్ సమీక్షలు, సమావేశాలు జరిగేవి. అంతా కెసీఆర్ కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఒకప్పుడు టీఆర్ఎస్ లో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న హరీష్ రావు పరిస్థితి ఇప్పుడు తన శాఖ సమీక్షకు తనను కూడా పిలవని పరిస్థితికి వచ్చింది.
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక స్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏకంగా.52,750 కోట్ల రూపాయలు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి 39,608 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు రూ.33,704 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కానీ, కరోనా వల్ల పెరగాల్సిన 15 శాతం పెరగక పోగా, గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం 67,608 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ కేవలం రూ.33,704 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఏడాది ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.33,904 కోట్లు తగ్గనుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి.
పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,025 కోట్లు తగ్గాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 9,725 కోట్ల రూపాయలకు గాను, 8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో 802 కోట్ల రూపాయలు కోత పడే అవకాశం ఉంది. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అంటే ఏకంగా రాష్ట్ర మంత్రులు కూడా కేవలం పేరుకు మాత్రమే ఉంటారు..అంతా సీఎం కెసీఆర్..అధికారులు కలసి చేస్తారనే సంకేతాలు తెలంగాణ సీఎం మరోసారి పంపారు.