హీరో విక్రమ్ అపరిచితుడు సినిమాలో రెండు వేరియషన్స్ అద్భుతంగా చూపిస్తాడు. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీకి సంబంధించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ చూపిస్తున్న వేరియేషన్స్ చూసి రాజకీయ పండితులు సైతం అవాక్కు అవుతున్నారు. అంతే కాదు..ఆ వేరియేషన్స్ ఏకంగా దశావతారం సినిమాలో కమలహాసన్ రేంజ్ కు చేరాయని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలపై కెసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇది నిజమే కదా అని అన్పించకమానదు. ఓ సారి ఢిల్లీలో అగ్గిరాజేస్తాం..ఢిల్లీ నేతలను గడగడలాడిస్తాం అని ప్రకటిస్తారు. తర్వాత అగ్గి రాజేయటం ఉండదు..గడగడలాడించటమూ ఉండదు. కొద్ది రోజుల క్రితం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంటూ హంగామా చేశారు. మా వాళ్లు అంతా కూడా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చమంటుటున్నారు అంటూ ప్రకటించారు. తర్వాత చూస్తే ఈ బీఆర్ఎస్ బీరువాలోకి వెళ్లినట్లే కన్పిస్తోంది. ఓ సారి దేశమంతటా అన్ని పార్టీల నాయకులను కలుస్తా..నాయకులను ఏకంగా చేస్తా అని ప్రకటించారు. తర్వాత కూల్ గా ఇదేదో నాలుగు పార్టీలు..నలుగురు నాయకుల గుంపు కాదు..కావాల్సింది గుణాత్మకమార్పు రావాలి..ఈ దిశగానే నా ప్రయత్నం అంటూ ప్రకటించారు. అసలు ఆ గుణాత్మకమార్పు అనే పదార్ధం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రొటీన్ ప్రభుత్వాలు వద్దు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడూ రొటీన్ గానే ఉంటుంది...రాష్ట్రంలో అయినా..కేంద్రంలో అయినా మార్పు చూపించాల్సింది పాలిస్తున్న నాయకులనే. తొలుత దేశాన్ని పాలించటంలో బిజెపి, కాంగ్రెస్ లు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శలు గుప్పించారు. కానీ గత కొంత కాలంగా కాంగ్రెస్ విషయంలో అప్పటి దూకుడు ను తగ్గించినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా బిజెపి ముక్త్ భారత్ నినాదాన్ని అందుకున్నారు.
ఓ రాష్ట్రానికి పరిమితం అయిన టీఆర్ఎస్ కు అసలు ఇది సాధ్యం అయ్యే పనేనా?. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చిన కెసీఆర్ కు పెద్ద ఎదురుదెబ్బే తగిలిన విషయం తెలిసిందే.