అప్పుడు కాళేశ్వరం ..యాదాద్రి...ఇప్పుడు కొత్త సచివాలయం
దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క వరదకు కోట్ల రూపాయల విలువైన మోటార్లు మునిగిపోయాయి. వందల కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన యాదాద్రి దేవాలయం నిర్మాణంలో డొల్లతనం ఒక్క భారీ వర్షంతో బయటపడింది. ఇప్పుడు కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం, ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే కొత్తగా కట్టిన ఈ ప్రాజెక్టుల వద్దకు సీఎం కెసిఆర్ పదుల సంఖ్యలో వెళ్ళటం...వెళ్లిన ప్రతిసారి అక్కడ ఇంజనీర్లకు పలు సూచనలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు రావటం చాలా కామన్ గా జరిగేవి. ఇప్పుడు సెక్రటేరియట్ ప్రమాదం మరో సారి కెసిఆర్ కొత్త కట్టడాలపై చర్చకు కారణం అవుతోంది. పాత సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ కూడా లేదు. సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా లేవు అంటూ కెసిఆర్ కొత్త సచివాలయం కట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాటలు. పాత సచివాలయం కూల గొట్టడంపై చాలా విమర్శలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మాటలు చెప్పి సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. విమర్శలు ఎన్ని వచ్చినా తాను అనుకున్నట్లు ముందుకే వెళ్లారు. అంత వరకు బాగానే ఉంది.
ఎక్కడ అయితే అంటే పాత సచివాలయంలో ఫైర్ సేఫ్టీ లేదు అని కొత్త సచివాలయం కట్టారో...అన్ని అత్యాధునిక వసతులతో ఉన్నట్లు చెప్పిన చోట అంటే అదే కొత్త సచివాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్తగా కట్టే భవనాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందునా ముఖ్యమంత్రి, మంత్రులు, మొత్తం రాష్ట్ర పరిపాలనకు చెందిన ఉన్నతాధికారులు అందరూ కొలువు తీరే చోట అంటే అక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. కానీ కొత్త సచివాలయంలో....అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ..దీనికి సంబంధించి పొగలు పెద్ద ఎత్తున అలముకోవటంతో ఇది ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కట్టిన ప్రాజెక్టుల్లో డొల్లతనం బయటపడటం ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపించే అంశాలే అని వ్యాఖ్యానిస్తున్నారు.