కెసీఆర్ కలవరు...తమిళ్ సై కలుస్తున్నారు..అంతే తేడా
గవర్నర్ నిర్ణయంతో మరోసారి చర్చనీయాంశం కానున్న సీఎం కెసీఆర్ తీరు
ఓ ముఖ్యమంత్రి ప్రజలను..సమస్యల్లో ఉన్న వారిని కలిస్తే ఆ సమస్యకు అక్కడకు అక్కడే పరిష్కారం చూపించగలరు. అది నిబంధనలకు విరుద్ధం అయినా..పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రత్యేక అధికారంతో కూడా నిర్ణయం తీసుకునే శక్తి రాష్ట్రంలో ఒక్క సీఎంకే ఉంటుంది. ప్రజలతో ఎన్నికైన వారికి ఉండే వెసులుబాటు అది. మరి గవర్నర్ ఏమి చేస్తారు. ఆమెకు ఏమైనా ఫిర్యాదులు వస్తే వాటికి ప్రభుత్వానికి పంపి పరిశీలించమని సూచిస్తారు. అంతే కానీ ఆమె ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు వస్తాయి. కానీ రొటీన్ పరిపాలనా వ్యవహారాల్లో, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నర్ కు ఏ మాత్రం ఉండదు. సీఎం కెసీఆర్ హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో ప్రజలను కలవక..సంవత్సరాలకు సంవత్సరాలే అయింది. గతంలో ఓ సారి ప్రజాదర్భార్ పెడతామని ప్రకటించారు. అంతే కాదు..ప్రగతి భవన్ పై విమర్శలు వచ్చినప్పుడు నాయకులకే కాదు..ప్రజలకు కూడా ప్రగతి భవన్ అంతా చూపిస్తానన్నారు. కానీ ఆ దిశగా ఏమీ జరగలేదు. ప్రగతి భనవ్ లో మంత్రులు..ఎమ్మెల్యేలు,,ఐఏఎస్ లకు ఎంట్రీ కూడా అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే.
ఏమీ చేసే అధికారం లేకపోయినా గవర్నర్ ఇప్పుడు ప్రజాదర్భార్ పెట్టారు. అన్నీ చేసే అధికారం ఉన్నా సీఎం కెసీఆర్ ఇంత వరకూ ప్రజలను నేరుగా కలిసే ప్రయత్నం చేయటం లేదు. నిజంగా ప్రజలకు సీఎంతో నేరుగా పని ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని సమస్యలు సీఎం స్థాయిలోనే పరిష్కారం అవుతాయి. కానీ ఆయన దగ్గరకు వెళ్ళటం అంటే ఇప్పుడు అంత ఈజీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు తరచూ ప్రజలను కలిసేవారు. కానీ తెలంగాణ వచ్చాకే ఆ పద్దతికి బ్రేక్ వేశారు. నిజంగా ముఖ్యమంత్రి కెసీఆర్, లేకపోతే మంత్రులు అయినా వారంలో ఒక రోజు అయినా ప్రజల బాధలు చెప్పుకోవటానికి సమయం కేటాయించి ఉంటే ఇప్పుడు అసలు గవర్నర్ తమిళ్ సైకు ప్రజాదర్భార్ పెట్టే ఛాన్స్ కూడా ఉండేది కాదు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే గవర్నర్ కు ఆ అవకాశం..ఛాన్స్ ఇచ్చింది ముఖ్యమంత్రి కెసీఆర్ అనే చెప్పుకోవాలి. గవర్నర్ చేసే పని రాజ్యాంగబద్ధమా?. రాజకీయ ప్రేరేమితమా అన్న చర్చ విషయానికి వచ్చినా అసలు అందుకు కారణం అయింది ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు అదే మాటను గవర్నర్ తమిళ్ సై బహిరంగంగానే చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజల బాధలు వినటం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సచివాలయం లో ఇప్పుడు ప్రజలకు ఎంట్రీ లేదు. ఒక్క ప్రజలకే కాదు..మీడియాకు సైతం ప్రవేశం లేదు. పాత సచివాలయం ఉన్న రోజుల్లోనూ ముఖ్యమంత్రి కెసీఆర్ సచివాలయానికి రాలేదు. ఇంచుమించు చాలా వరకూ మంత్రులదీ అదే పరిస్థితి. అసలు తెలంగాణ వచ్చాక ప్రజలు నేరుగా ముఖ్యమంత్రిని కలిసే ఛాన్సే లేకుండాపోయింది. ప్రజలే కాదు..ఏకంగా ఆయన మంత్రివర్గ సహచరులు...ఎమ్మెల్యేలకు కూడా ఆ ఛాన్స్ లేదని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పలుమార్లు బహిరంగంగా స్పష్టం చేశారు. సీఎం కెసీఆర్ ఉంటే ప్రగతి భవన్ లేదంటే ఫాంహౌస్. ఓ ముఖ్యమంత్రి ఫాంహౌస్ లో ఏకంగా పది రోజులు..పదిహేనురోజులు ఉండటం అనేది పెద్ద సంచలన వార్తే. బహుశా ఇలా చేసింది దేశంలో కెసీఆర్ ఒక్కరే అయి ఉండొచ్చు. పత్రికల్లో కూడా నిత్యం ఫాంహౌస్ నుంచి ప్రగతిభవన్ కు ముఖ్యమంత్రి అంటూ వార్తలు చూస్తూనే ఉంటాం. ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా నెలకు లక్షలకు లక్షలు వేతనం తీసుకుంటారు.
మరి కెసీఆర్ లాగానే మేం కూడా ఇంటి నుంచే పనిచేస్తాం అని ఐఏఎస్ లు, ఉద్యోగులు అంటే ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందా?. సచివాలయం అన్న కాన్సెప్ట్ పెట్టిందే అందరూ ఒక చోట ఉండి రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి. ఫైల్స్ పరుగులు పెట్టించటానికి. సీఎం అంటే ఉద్యోగిలా రోజూ ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటలకు వెళ్లాలని ఎవరూ చెప్పరు. కానీ అసలు నెలకు ఒక రోజు అయినా రాకపోవటమే ఇప్పుడు సమస్య. సంవత్సరాలకు సంవత్సరాలు సచివాలయం గడప తొక్కని సీఎం కింద కెసీఆర్ ఓ రికార్డు నమోదు చేస్తారేమో. సీఎం కెసీఆర్ సచివాలయానికి రాకపోవటంపై మీడియా ప్రశ్నిస్తే మంత్రి కెటీఆర్ ఓ సభలో అసలు ప్రజలకు సీఎంతో పని ఏమి ఉంటుంది. సీఎంను ప్రజలు కలవాల్సి వస్తుంది అంటే అది వ్యవస్థ వైపల్యం కిందకే వస్తుందని..జిల్లాల్లో మంత్రుల.. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు..ఎమ్మార్వోలు ఇలా చాలా మంది ఉంటారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు గవర్నర్ తమిళ్ సై ప్రజాదర్భార్ తో రాజకీయ రచ్చ మొదలైంది. ఇది చూసిన వారంతా కూడా ప్రభుత్వంపై కంటే తమిళ్ సై వైపు మొగ్గుచూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఎలాగూ కలవరు..కలిసే వారు కలిస్తే మీకేంటి బాధ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. గవర్నర్ ఇలా కలవటం రాజ్యాంగ బద్ధమా కాదా అన్న అంశాలు సమస్యలు ఎదుర్కొనేవాడికి అనవసరం. కరోనా సమయంలో కూడా గవర్నర్ తమిళ్ సై నిజంగానే ఆస్పత్రులను సందర్శించి సాహసమే చేశారు.