ప్రస్తుత మంత్రులపై ఇంటెలిజెన్స్ నివేదికలు
కొత్త వారిపై కూడా తెప్పించాలని ఆదేశం
ఏపీ సీఎం జగన్ కొత్త ప్రయోగానికి తెరతీయబోతున్నారు. కాకపోతే ఈ విషయాన్ని ఆయన తన ప్రమాణ స్వీకార సమయంలోనే వెల్లడించారు. రెండున్నర సంవత్సరాలు కొంత మందికి..మరో రెండున్నర సంవత్సరాలు మరికొంత మందికి మంత్రి పదవులు ఇస్తానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకూ ఈ తరహా ప్రయోగం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జగన్ సర్కారు ఏర్పడి రెండున్నర సంవత్సరాలకు ఇంకా కొద్దిరోజులే గడువు ఉంది. అందుకే ఇప్పటికే ఆయన ప్రస్తుత మంత్రివర్గంలోని కొంత మంది మంత్రులతోపాటు కొత్తగా కేబినెట్ లోకి తీసుకోబోయే వారికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించాల్సిందిగా ఆదేశించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తన అభిప్రాయంతోపాటు ఇంటెలిజెన్స్ నివేదికల నివేదికల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముందుకెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత మంత్రుల్లో చాలా మందిపై కూడా నివేదికలు కోరటం విశేషం. అయితే ఈ నివేదికల్లో వచ్చే సమాచారం ఆధారంగా కొంత మందిని తొలగించకపోచ్చని అందుకే వారిపై కూడా సమాచారం కోరినట్లు చెబుతున్నారు. సీఎం జగన్ నివేదికలు కోరిన వారి జాబితాలో మంత్రులు పుష్ప శ్రీవాణి, మేకతోటి సుచరిత, కె. నారాయణస్వామి, కురసాల కన్నబాబు, శంకరనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గుమ్మనూరు జయరామ్ తదితరులు ఉన్నారు.
అదే సమయంలో శ్రీకాళం జిల్లాలోని పాలకొండకు చెందిన కళావతి, విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల ఎమ్మెల్యే బి. ముత్యాలనాయుడు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు పెండ్యం, నర్సాపురం ప్రసాద్ రాజు, భీమవరం గ్రంధి శ్రీనివాస్, పెడన జోగి రమేష్, చిలకూరిపేట విడదల రజనీ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , శింగనమల జొన్నలగడ్డ పద్మావతి తదితరుల పేర్లకు సంబంధించి నివేదికలు కోరినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఉన్న మంత్రులతోపాటు..కొత్తగా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తీసుకునే వారిలో ఎవరిపై వేటు ఉంటుంది..ఎవరికి పదవి వరిస్తుంది అన్నది ఇప్పుడే చెప్పటం కష్టం అని ఆ వర్గాలు తెలిపాయి. టీటీడీ ఛైర్మన్ పదవికి సుబ్బారెడ్డి నో చెప్పటంతో మేకపాటి గౌతంరెడ్డికి మాత్రం టీటీడీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మంత్రివర్గ మార్పులు చేయనుండటంతో అధికార వైసీపీలో మరో సారి పదవులు హడావుడి ప్రారంభం కాబోతుంది.