జ‌గ‌న్ కూడా ఇప్పుడు యాంటీపూర్ గా మారారా?!

Update: 2022-02-10 11:57 GMT

సినిమా టిక్కెట్ రేట్లు పెంచాల‌నే వారంతా పేద‌ల వ్య‌తిరేకులంటూ విమ‌ర్శ‌లు

ఇప్ప‌డు స్టూడియోలకు..ఇళ్ళ స్థ‌లాలు తీసుకోండి అంటూ ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు

సీఎం జ‌గ‌న్ తో టాలీవుడ్ ప్ర‌ముఖులు క‌ల‌వ‌గానే అంతా మారిపోయిందా?. కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష్ తీసుకునే ద‌ర్శ‌కులు. హీరోలు మ‌హానుభావులుగా, పేద‌ల ఉద్ధార‌కులుగా మారిపోయారా?. టిక్కెట్ ధ‌ర‌ల‌కు సంబంధించిన నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌భుత్వం క‌మిటీ నియ‌మించిన త‌ర్వాత కూడా సీఎం జ‌గ‌న్ గుంటూరు జిల్లాలో పెంచిన పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ 'సినిమా టిక్కెట్ ధ‌ర‌లు పెంచాల‌నే వాళ్ళు అంతా పేద‌ల వ్య‌తిరేకులే. పేద‌వాడికి త‌క్కువ ధ‌ర‌కు వినోదం అందివ్వాల‌నే చూస్తుంటే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.' అంటూ మండిప‌డ్డారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ త‌న వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా గ‌తంలో ఉన్న రేట్ల‌లో మార్పులు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ కూడా యాంటీపూర్ కిందే మారిపోయిన‌ట్లు లెక్కా?. ఎందుకంటే ఇది ఎవ‌రో అన్న‌ది కాదు..ఆయ‌న స్వ‌యంగా చెప్పిన మాట‌. టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు అంద‌రూ క‌ల‌వ‌గానే వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. వైజాగ్ తోపాటు ఏపీలో కూడా షూటింగ్ లు చేయాల‌ని..తెలంగాణ కంటే ఏపీ నుంచే ఎక్కువ ఆదాయం వ‌స్తోంద‌ని పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో ఎవ‌రైనా స్టూడియోలు క‌ట్ట‌డానికి ముందు వ‌స్తే వారికి అవ‌స‌ర‌మైన భూములు..ప‌రిశ్ర‌మ వారికి ఇళ్ళ స్థ‌లాలు ఇస్తామ‌ని ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇచ్చారు. గ‌తంలో కూడా ఇదే త‌ర‌హా ఆఫ‌ర్లు ఇచ్చారు. త‌ర్వాత ఫాలో అప్ చేసింది ఏమీలేదు. కానీ మ‌ధ్య‌లో రేట్ల వివాదాన్ని రాజేశారు. ఏపీకి చెందిన మంత్రులు సినీ ప‌రిశ్ర‌మ చేసిన వ్యాఖ్య‌ల‌కు పూర్తి భిన్న‌మైన నిర్ణ‌యాలు ఇప్పుడు ప్ర‌భుత్వం తీసుకుంది. హీరోలు రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించుకుంటే సినిమా నిర్మాణ వ్యయం త‌గ్గుతుంద‌ని కొంత మంది మంత్రులు ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. అంతే కాదు..వైసీపీ సోష‌ల్ మీడియా గ్రూపులు అయితే..హీరోలు విలాస‌వంతంగా ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతున్నార‌ని..ఇలాంటి వాళ్ళ ఖ‌ర్చుల కోసం రేట్లు పెంచాలా అంటూ భారీ ఎత్తున ట్రోలింగ్ న‌డిపించారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ పూర్తిగా రివ‌ర్స్ గేర్ వేశారు. రేట్ల పెంపున‌కు ఓకే చెప్ప‌టంతో విశాఖ‌లో స్థ‌లాలు ఇస్తామ‌న్నారు. జూబ్లిహిల్స్ త‌ర‌హాలో విశాఖ‌ప‌ట్నం ప్రాంతాన్ని కూడా డెవ‌ల‌ప్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నే..అప్పుడే కొంత కాలానికి చెన్న‌య్, బెంగుళూరు, హైద‌రాబాద్ ల‌కు ధీటుగా వైజాగ్ డెవ‌ల‌ప్ అవుతుంద‌ని అన్నారు.

Tags:    

Similar News