ప్రభుత్వ కమిటీ పేదల వ్యతిరేకమా?. సినిమా పరిశ్రమ అనుకూలమా?.
కొత్త సమస్య తెచ్చిపెట్టిన సీఎం జగన్
ఏపీలో అత్యంత వివాదస్పదంగా మారిన సినిమా టిక్కెట్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిశ్రమ వర్గాల్లో మరింత గుబులు రేపుతున్నాయి. ఈ అంశాన్ని తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. త్వరలోనే అంతా కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఈ అధికారులు కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న టెన్షన్ లో పడ్డారు టాలీవుడ్ ప్రముఖులు. పేదవాడికి తక్కువ ధరకే వినోదం అందించాలని తాము చూస్తుంటే కొంత మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని...వీరంతా యాంటీ పూర్ అంటే పేదల వ్యతిరేకులే అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం నియమించిన కమిటీ ముఖ్యమంత్రి జగన్ చేసిన బహిరంగ వ్యాఖ్యలకు భిన్నంగా వెళుతుందా?. ధరలు పెంచాలనే వాళ్ళు అంతా పేదల వ్యతిరేకులే అని జగన్ ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మరి ఈ దశలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. పరిశ్రమ వర్గాలు కోరుతున్న మేరకు పెంపు ఉంటుందా?. లేక పేదవాడికి తక్కువ ధరకు వినోదం అందివ్వాలనే జగన్ నిర్ణయానికే కమిటీ కట్టుబడి ఉంటుందా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలతో ఈ సమస్య మరింత జఠిలంగా మారినట్లు అయిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన దిశా, నిర్దేశం ఉంటే తప్ప..అధికారులు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోరని అంటున్నారు. మరి బహిరంగంగా రేట్ల తగ్గింపును గట్టిగా సమర్ధించుకున్న జగన్ ఇప్పుడు ఉదారంగా రేట్ల పెంపునకు అనుమతి ఇస్తారా?. అసలు పెంచితే ఏ మేరకు పెంచుతారు అన్న టెన్షన్ పరిశ్రమ వర్గాల్లో ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును వ్యతిరేకించే..జగన్ అభిమానిగా ఉన్న వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. కరోనా, ఏపీ సర్కారు రెండూ ఒకటే అని..భరించాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోల రెమ్యునేషన్లు తగ్గించుకుంటే అసలు సమస్యే ఉండదంటూ కొంత మంది మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ ఘాటుగా స్పందించారు. చూస్తుంటే ఏపీ ప్రభుత్వం కొన్ని రోజులకు బెడ్ రూమ్స్ లోకి కూడా దూరేలా ఉందని అంటూ ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సినిమా అనేది ప్రేక్షకుడి ఆప్షన్ అని..ప్రభుత్వం..మంత్రులు ఇలా ఎందుకు చేస్తున్నారో అని వర్మ స్పందించారు. వర్మ కంటే ముందే ఏపీలో దుమారం రేపుతున్న సినిమా టిక్కెట్ల వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. సంక్రాంతి సమయంలో ఏపీఎస్ఆర్టీసి ప్రస్తుత ఛార్జీలను 50 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆసరా చేసుకుని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే తమ ఆర్టీసీ బస్సుల్లో రేట్లు పెంపులేదని..వీటిని వాడుకోవాలని ఓ ప్రకటనే విడుదల చేశారు. ఏపీకి బస్సుల్లో వెళ్ళే వారు పేదలు..మధ్య తరగతి ప్రజలు కాదా?. మరి వాళ్ల నుంచి రెగ్యులర్ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా ఎలా వసూలు చేస్తారు?. సినిమా టిక్కెట్లకు ఓ రూలు...ఏపీఎస్ ఆర్టీసీ బస్సు టిక్కెట్లకు ఓ రూలా? అంటూ విమర్శలు గుప్పించారు. ఇలా పలు అంశాల మధ్య పోలిక పెడుతూ ఏపీ సర్కారు తీరును తప్పుపట్టారు.