వచ్చే ఎన్నికల సమయానికి చిరంజీవి కూడా జనసేనకు మద్దతుగా రంగంలోకి దిగుతారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీనికి సంబంధించిన వీడియో కూడా మీడియాలో హల్ చల్ చేసింది. జనసేన నేతల అంతర్గత సమావేశంలో నాదెండ్ల మనోహర్ ఈ మాటలన్నారు. అయితే తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ జనసేన వర్గాలను షాక్ కు గురిచేసింది. ఏపీలో తాజాగా ఒకేరోజు 13.72 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. దీనిపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి. వ్యాక్సినేషన్ వరకూ ప్రశంసించి ఉంటే ఓకే..అలా కాకుండా చిరంజీవి ఓ అడుగు ముందుకేసి మరీ సీఎం జగన్ స్పూర్తిదాయక నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు. ఇది జనసేన నేతలను మరింత షాక్ కు గురిచేసింది. ఇది డిజిటల్ యుగం. గతంలో లాగా ఏది మాట్లాడినా మర్చిపోవటాలు ఉండవు. ప్రతి ఒక్కటీ రికార్డు అవుతూనే ఉంటుంది. కారణాలు ఏమైనా చిరంజీవి మాత్రం సీఎం జగన్ విషయంలో మొదటి నుంచి సానుకూలంగానే ఉంటున్నారు.
ఇప్పుడు వ్యాక్సిన్ సంబంధించి చేసిన ట్వీట్ లో పొగడ్తల డోస్ ఇంకాస్త ఎక్కువ పెంచారని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ రేపు ఎప్పుడైనా మనసు మార్చుకుని తమ్ముడి పార్టీ కోసం రంగంలోకి దిగినా ఇప్పుడు చేసిన కామెంట్లు తర్వాత ముల్లులుగా మారే అవకాశం ఉందని ఓ నేత వ్యాఖ్యానించారు. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ..ఈ మధ్య కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. సీఎం జగన్ త్వరలోనే చిరంజీవికి రాజ్యసభ సీటు కూడా ఇవ్వబోతున్నారన్నదే ఆ ప్రచారం. ఏది ఏమైనా తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ మాత్రం జనసేన వర్గాలను మాత్రం షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. అంతే కాదు..గత కొంత కాలంగా అంటే ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీ కార్యకలాపాలు కూడా చాలా పరిమితం అయ్యాయి.