ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలన చూడలేదా. వాళ్లకు చంద్రబాబు గురించి తెలియదా?.ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఒక మాట అన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు..ఎవరికి ఓటు వేయాలో మీ ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి ఈ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. చంద్రబాబు చివరి ఎన్నికల మాటను అధికార వైసీపీ ఒక అస్త్రంగా మార్చుకుని చంద్రబాబుపై పెద్ద ఎత్తున ఎటాక్ చేసింది. దీంతో ఒకింత తేడా ఉందని గ్రహించిన టీడీపీ శ్రేణులు.. ఇది చంద్రబాబుకు చివరి ఛాన్స్ కాదు..రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఇస్తున్న చివరి ఛాన్స్ అంటూ ప్రచారం మొదలు పెట్టాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అందుకున్నారు. తాజాగా అయన రాష్ట్రానికి ఇదే చివరి ఛాన్స్ అంటూ కామెంట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి మూడున్నర సంవత్సరాల పాలన చూసిన తర్వాత చాలామంది జగన్ కంటే చంద్రబాబు పాలనే ఎంతో కొంత బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా ఈ అభిప్రాయం ఉద్యోగులు, పట్టణవాసులు, విద్యావంతుల్లో ఉంది. వివిధ పధకాల లబ్ధిదారులు మాత్రం జగన్ వైపే ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. జగన్ కూడా అందుకే ఫోకస్ అంతా ఎన్నికల్లో గెలిచేందుకు అవసరం అయ్యే వర్గాలను టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారు. ఇది ఎక్కువకాలం నిలబడే వ్యవహారం కాదు అని అధికారులు, నిపుణులు చెపుతున్నారు. జగన్ తప్పులను,,పాలనా వైఫల్యాలను ఎత్తిచూపటాన్ని ఎవరూ తప్పు పట్టరు.
Full Viewఅది చంద్రబాబు పాలన అయినా, జగన్ పాలన అయినా ప్రజల్లో సహనం నశిస్తే ఎవరూ కాపాడలేరు. కానీ చంద్రబాబు, తెలుగు దేశం శ్రేణులు మాత్రం తాము లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లేదు..ఉండదు అనే లెవల్లో బిల్డప్ ఇస్తే మొదటికే మోసం వస్తుందనే భయం కొంత మంది నేతల్లో ఉంది. ఈ విషయం ఆ పార్టీ నేతలు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019 లో ఎన్నికలకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారు. అప్పటివరకు జగన్ పాలన చూడలేదు కాబట్టి ప్రజలు నిజంగానే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. విభజన తర్వాత ఫస్ట్ ఛాన్స్ సీనియారిటీ, పరిపాలన అనుభవం తదితర కారణాల వాళ్ళ చంద్రబాబుకే దక్కిన విషయం తెలిసిందే. టీడీపీ వాళ్ళు చెపుతున్నట్లు వైసీపీ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా..ఏమి చేసినాకూడా తొలి ఛాన్స్ దక్కించుకున్న టీడీపీ 23 సీట్లకు పడిపోవటంలో అటు చంద్రబాబు, ఇటు టీడీపీ తమ తప్పులేమి లేవు అన్న చందంగా వ్యవరిస్తోంది. ఎంత దుష్ప్రచారం చేసినా టీడీపీ లాంటి పార్టీ 23 సీట్లకు పడిపోయింది అంటే అందులో కచ్చితంగా నాయకుడి వైఫల్యం ఉంటుంది అనే విషయాన్ని మాత్రం ఎవరూ పెద్ద గా పట్టించుకోవటం లేదు. జగన్ తనకు వచ్చిన తొలి ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవటం లేదనే అభిప్రాయంలో చాలా మంది వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ అంశాలపై జగన్ తీవ్ర విమర్శలు చేశారో రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాల విషయాల్లో దారుణంగా విఫలమయ్యారనే చెప్పాలి. మద్యం అమ్మకాలు, ఇసుక, రహదారులు వంటి కీలక అంశాల్లోనూ జగన్ తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్నారు. జగన్ వైఫల్యాలే ఇప్పుడు టీడీపీ, జనసేనలకు అస్త్రాలుగా మారబోతున్నాయి.