అధికారం కోల్పోయిన మూడేళ్ల తర్వాత కూడా బిజెపికి టీడీపీ ఎందుకింత భయపడుతుందో అర్ధం కావటం లేదంటూ కొంత మంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ విషయంలో విమర్శలపై చూపించే దూకుడులో బిజెపి విషయంలో మాత్రం నిల్. ఛాన్స్ వచ్చినా జగన్ కేంద్రం..ప్రధాని మోడీ ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టకుండా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో భేషరతు మద్దతుపై మీడియాలో అయితే కథనాలు వచ్చాయి కూడా చంద్రబాబు నోరుతెరిచి ఈ అంశంపై మాట్లాడింది లేదు. విచిత్రం ఏమిటంటే ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అమలు చేయకపోయినా అధికార వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీ, మిత్రపక్ష జనసేన వరకూ ఎవరూ బిజెపిని ఏమీ అనరు. అంతే కాదు..జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికలో అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ద్రౌపది ముర్ముకే ఓటు వేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం టీడీపీ నేతలు అంతా గప్ చుప్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు చక్రాలు తిప్పానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు బహిరంగంగా ఎవరికి ఓటు వేసేది కూడా చెప్పుకోలేని..చెప్పలేని పరిస్థితికి చేరుకోవటం విచిత్రం.